తెలుగు మురళి · Brahma Kumaris

ఈరోజు మురళి · 14 జనవరి, 2026

ఓం శాంతి · BapDada · 14 జనవరి, 2026

ఈరోజు మురళి — today murli telugu, every morning.

18
డౌన్‌లోడ్ PDF
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

14-01-2026
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - అడుగడుగులోనూ తండ్రి శ్రీమతముపై నడుస్తూ ఉండండి, ఒక్క తండ్రి నుండే విన్నట్లయితే మాయ దాడి జరగదు’’
ప్రశ్న:- ఉన్నత పదవిని పొందేందుకు ఆధారమేమిటి?
జవాబు:- ఉన్నత పదవిని పొందేందుకు తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ పై నడుస్తూ ఉండండి. తండ్రి డైరెక్షన్ లభించగానే పిల్లలు దానిని ఆచరించాలి. వేరే ఏ విషయము సంకల్పములో కూడా రాకూడదు. 2. ఈ ఆత్మిక సేవలో నిమగ్నమైపోండి. మీకు ఇంకెవ్వరి స్మృతి కలగకూడదు. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమంతా మరణించినట్లే, అప్పుడు ఉన్నత పదవి లభించగలదు.
పాట:- మిమ్మల్ని పొంది మేము...

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఇది భక్తి మార్గములో పాడినటువంటి పాట. ఈ సమయములో తండ్రి దీని రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మనము తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని పొందుతున్నామని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. మన ఆ రాజ్యాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. భారత్ యొక్క రాజ్యాన్ని ఎంతోమంది దోచుకున్నారు కదా. ముసల్మానులు దోచుకున్నారు, ఆంగ్లేయులు దోచుకున్నారు. వాస్తవానికి మొట్టమొదట రావణుడు దోచుకున్నాడు, ఆసురీ మతము ద్వారా దోచుకున్నాడు. ఈ కోతుల చిత్రాలనేవైతే తయారుచేస్తారో - హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్... (చెడు వినకండి, చెడు చూడకండి...) దీని వెనుక కూడా ఏదో రహస్యము ఉంటుంది కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఒక వైపు రావణుడి యొక్క ఆసురీ సాంప్రదాయమువారు ఉన్నారు, వారికి తండ్రి గురించి తెలియదు, ఇంకొకవైపు పిల్లలైన మీరు ఉన్నారు. మీకు కూడా ఇంతకుముందు తెలియదు. తండ్రి ఇతని గురించి కూడా ఏమని వినిపిస్తారంటే - ఇతను కూడా ఎంతో భక్తి చేసారు, ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ, ఇతనే మొదట పావనముగా ఉండేవారు, ఇప్పుడు పతితముగా అయ్యారు. ఇతను నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఇంకెవ్వరి మాట వినకండి. తండ్రి అంటున్నారు, నేను పిల్లలైన మీతో మాట్లాడతాను. అయితే, ఎప్పుడైనా ఎవరైనా మిత్ర-సంబంధీకులు మొదలైనవారిని తీసుకువస్తే, వారితో కూడా కొద్దిగా మాట్లాడతాను. మొదటి విషయమేమిటంటే - పవిత్రముగా అవ్వాలి, అప్పుడే బుద్ధిలో ధారణ అవుతుంది. ఇక్కడి నియమాలు చాలా కఠినమైనవి. 7 రోజులు భట్టీలో ఉండాలని, ఇంకెవ్వరూ గుర్తుకురాకూడదని, ఉత్తరాలు మొదలైనవి కూడా వ్రాయకూడదని ఇంతకుముందు చెప్పేవారు. ఎక్కడ ఉన్నా కానీ మొత్తము రోజంతా భట్టీలో ఉండవలసి ఉండేది. ఇప్పుడైతే మీరు భట్టీలో ఉండి ఆ తర్వాత బయటకు వెళ్తారు. కొందరైతే ఆశ్చర్యము కలిగించేలా విన్నారు, వర్ణించారు, ఓహో మాయ, మళ్ళీ పారిపోయారు. ఇది చాలా పెద్ద గమ్యము. తండ్రి చెప్పేది ఒప్పుకోరు. తండ్రి అంటారు - మీరు వానప్రస్థులు, మీరెందుకు అనవసరముగా చిక్కుకున్నారు. మీరు ఈ ఆత్మిక సేవలో నిమగ్నమవ్వండి. మీకు ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచము మరణించినట్లే, అప్పుడు ఉన్నత పదవి లభించగలదు. మీ పురుషార్థమే నరుని నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థము. అడుగడుగులోనూ తండ్రి డైరెక్షన్ పై నడవాల్సి ఉంటుంది కానీ దానికి కూడా ధైర్యము కావాలి. కేవలం నోటితో చెప్పడము కాదు. మోహపు బంధము తక్కువేమీ కాదు, నష్టోమోహులుగా అవ్వాలి. ‘నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. నేనైతే బాబా శరణు తీసుకుంటాను. నేను ఎప్పుడూ విషము ఇవ్వను.’ మీరు ఈశ్వరుని వైపుకు వస్తే మాయ కూడా మిమ్మల్ని విడిచిపెట్టదు, బాగా పడేస్తుంది. ఉదాహరణకు వైద్యులు చెప్తుంటారు కదా, ఈ మందుతో ముందు రోగమంతా బయటకు వస్తుంది, భయపడకండి అని. ఇది కూడా అటువంటిదే. మాయ బాగా సతాయిస్తుంది, వానప్రస్థ అవస్థలో కూడా వికారీ సంకల్పాలను తీసుకువస్తుంది. మోహము ఉత్పన్నమవుతుంది. ఇవన్నీ జరుగుతాయని బాబా ముందే చెప్పేస్తారు. జీవించి ఉన్నంతవరకు మాయతో ఈ బాక్సింగ్ జరుగుతూనే ఉంటుంది. మాయ కూడా పహల్వాన్ (వస్తాదు)గా అయి మిమ్మల్ని విడిచిపెట్టదు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. వికల్పాలు తీసుకురావద్దని నేనేమీ మాయకు చెప్పను. బాబా, కృప చూపించండి అని చాలామంది వ్రాస్తుంటారు. నేను ఎవరిపైనా కృప చూపించను. ఇక్కడ మీరు శ్రీమతముపై నడవాలి. నేను కృప చూపిస్తే ఇక అందరూ మహారాజులుగా అయిపోతారు. డ్రామాలో కూడా ఇది లేదు. అన్ని ధర్మాలవారు వస్తారు. ఎవరైతే ఇతర ధర్మాలలోకి ట్రాన్స్ఫర్ అయి ఉంటారో, వారు ఆ ధర్మము నుండి బయటకు వస్తారు. ఈ అంటు కట్టబడుతుంది, ఇందులో చాలా శ్రమ ఉంది. కొత్తవారు ఎవరైతే వస్తారో, వారికి కేవలం - తండ్రిని స్మృతి చేయండి అని చెప్పాలి. శివ భగవానువాచ. శ్రీకృష్ణుడైతే 84 జన్మలలోకి వస్తారు. అనేక మతాలు, అనేక విషయాలు ఉన్నాయి. ఇది బుద్ధిలో పూర్తిగా ధారణ చేయాలి. మనము పతితముగా ఉండేవారము. మనము పావనముగా ఎలా అవ్వాలి అనేది ఇప్పుడు తండ్రి తెలియజేస్తున్నారు. కల్పక్రితము కూడా చెప్పారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహ ధర్మాలన్నింటినీ వదిలి జీవిస్తూనే మరణించండి. తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను సర్వులకు సద్గతిని ఇవ్వడానికి వచ్చాను. భారతవాసులే ఉన్నతముగా అవుతారు, వారే మళ్ళీ 84 జన్మలు తీసుకుని కిందకు దిగుతారు. మీరు చెప్పండి - భారతవాసులైన మీరే ఈ దేవీ-దేవతలను పూజిస్తారు. వీరు ఎవరు? వీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? సత్యయుగములోనైతే ఈ దేవీ-దేవతలే ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఈ మహాభారత యుద్ధము ద్వారా అందరి వినాశనము జరగనున్నది. ఇప్పుడు అందరూ పతితముగా, తమోప్రధానముగా ఉన్నారు. నేను కూడా ఇతని అనేక జన్మల అంతిమములోనే వచ్చి ప్రవేశిస్తాను. ఇతను పూర్తి భక్తునిగా ఉండేవారు. నారాయణుని పూజను చేసేవారు. ఇతనిలోనే ప్రవేశించి మళ్ళీ ఇతడినే నారాయణునిగా తయారుచేస్తాను. ఇప్పుడు మీరు కూడా పురుషార్థము చేయాలి. ఈ దైవీ రాజధాని స్థాపనవుతూ ఉంది. మాల తయారవుతుంది కదా. పైన నిరాకారీ పుష్పము ఉంది, ఆ తర్వాత మేరువు, జంటపూసలు ఉన్నాయి. శివబాబా కింద వీరు అతి సమీపముగా నిలబడి ఉన్నారు. వీరు జగత్ పిత బ్రహ్మా మరియు జగదంబ సరస్వతి. ఇప్పుడు మీరు ఈ పురుషార్థము ద్వారా విష్ణుపురికి యజమానులుగా అవుతారు. భారత్ మాది అని ప్రజలు కూడా అంటారు కదా. మేము విశ్వానికి యజమానులము అని మీరు కూడా భావిస్తారు. మనము రాజ్యము చేస్తాము, అప్పుడు ఇంకే ధర్మమూ ఉండదు. ఆ ప్రపంచము ఉన్నప్పుడు - ఇది మా రాజ్యము అని అనడానికి లేదు ఎందుకంటే అక్కడ వేరే ఏ రాజ్యము ఉండదు. ఇక్కడ చాలా రాజ్యాలు ఉన్నాయి కావున నాది, నీది అని అనుకుంటూ ఉంటారు. అక్కడ ఇటువంటి విషయాలే ఉండవు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఇతర విషయాలన్నింటినీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఎవరో ఒకరు ఎదురుగా కూర్చుని యోగము చేయించాలని, దృష్టి ఇవ్వాలని కాదు. తండ్రి అయితే అంటారు - నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి. మీ చార్టు పెట్టండి - మొత్తం రోజంతటిలో ఎంత స్మృతి చేసాను? ఉదయాన్నే లేచి ఎంత సమయము తండ్రితో మాట్లాడాను? ఈ రోజు బాబా స్మృతిలో కూర్చున్నానా? ఈ విధముగా మీ విషయములో మీరు కృషి చేయాలి. జ్ఞానమైతే బుద్ధిలో ఉంది, దానిని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. కామము మహాశత్రువని ఎవరి బుద్ధిలోకీ రాదు. 2-4 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా మాయ దెబ్బ గట్టిగా తగిలితే కింద పడిపోతారు. అప్పుడు - బాబా, మేము నల్ల ముఖము చేసుకున్నాము అని వ్రాస్తారు. అప్పుడు బాబా ఇక ఇలా వ్రాస్తారు - అలా నల్ల ముఖము చేసుకున్నవారు 12 నెలలు వరకు ఇక్కడికి రావాల్సిన అవసరము లేదు. మీరు తండ్రికి ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారాలలోకి పడిపోతే ఇక నా వద్దకు ఎప్పుడూ రాకండి. ఇది చాలా పెద్ద గమ్యము. తండ్రి వచ్చిందే పతితము నుండి పావనముగా చేయడానికి. చాలామంది పిల్లలు వివాహము చేసుకుని పవిత్రముగా ఉంటారు. అయితే, ఎవరైనా కన్యలను దెబ్బలు కొడుతుంటే, వారిని రక్షించేందుకని గంధర్వ వివాహము చేయించి పవిత్రముగా ఉంచుతారు. వారిలో కూడా కొంతమందినైతే మాయ ముక్కుతో పట్టుకుంటుంది. వారు ఓడిపోతారు. స్త్రీలు కూడా ఎంతోమంది ఓడిపోతారు. వారిని బాబా అంటారు, మీరు శూర్పణఖ వంటివారు. ఈ పేర్లన్నీ ఈ సమయానికి చెందినవే. ఇక్కడైతే బాబా వికారులెవ్వరినీ కూర్చోనివ్వరు కూడా. అడుగడుగునా తండ్రి నుండి సలహా తీసుకోవలసి ఉంటుంది. సమర్పితమైపోతే ఇక తండ్రి అంటారు - ఇప్పడు ట్రస్టీగా అవ్వండి, సలహాపై నడుస్తూ ఉండండి. లెక్కాపత్రము తెలియజేస్తేనే సలహా ఇస్తారు. ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు. మీరు భోగ్ పెట్టినా కానీ నేనేమీ తినను. నేనైతే దాతను. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాస్ - 15-06-1968

ఏదైతే గతించిపోయిందో దానిని కనుక రివైజ్ చేస్తే, ఎవరి మనసైతే బలహీనముగా ఉందో, వారి మనసులోని బలహీనత కూడా మళ్ళీ రివైజ్ అయిపోతుంది, అందుకే పిల్లలను డ్రామా పట్టాలపై నిలబెట్టడము జరిగింది. ముఖ్యముగా లాభము కలిగేది స్మృతి ద్వారానే. స్మృతి ద్వారానే ఆయుష్షు పెరగనున్నది. డ్రామాను పిల్లలు అర్థం చేసుకున్నట్లయితే, ఇక ఎప్పుడూ వేరే ఆలోచనలు ఉండవు. డ్రామాలో ఈ సమయములో జ్ఞానాన్ని నేర్చుకోవడము మరియు నేర్పించడమనేది జరుగుతుంది. తర్వాత ఈ పాత్ర సమాప్తమైపోతుంది. అప్పుడిక తండ్రి పాత్ర ఉండదు, మన పాత్ర ఉండదు. అప్పుడు వారిది ఇచ్చే పాత్ర ఉండదు, మనది తీసుకునే పాత్ర ఉండదు. అప్పుడిక ఒకటైపోతారు కదా. అప్పుడిక మన పాత్ర కొత్త ప్రపంచములో ఉంటుంది, బాబా పాత్ర శాంతిధామములో ఉంటుంది. పాత్ర యొక్క రీల్ నింపబడి ఉంది కదా, మనది ప్రారబ్ధ పాత్ర, బాబాది శాంతిధామ పాత్ర. ఇచ్చి-పుచ్చుకునే పాత్ర పూర్తవ్వగానే డ్రామా కూడా పూర్తి అయిపోతుంది. అప్పుడు మనము రాజ్యము చేయడానికి వస్తాము, ఆ పాత్ర మారిపోతుంది. జ్ఞానము ఆగిపోతుంది, మనము అలా తయారైపోతాము. పాత్రయే పూర్తయిపోతే ఇక వ్యత్యాసమేమీ ఉండదు. పిల్లలు మరియు తండ్రి యొక్క పాత్ర కూడా ఉండదు. మీరు కూడా జ్ఞానాన్ని పూర్తిగా తీసేసుకుంటారు. ఇచ్చేవారి వద్ద కూడా ఏమీ ఉండదు. ఇచ్చేవారి వద్ద ఏమీ ఉండదు, తీసుకునేవారి వద్ద లోటు ఉండదు అన్నప్పుడు ఇరువురూ సమానమైపోతారు. ఇందులో విచార సాగర మంథనము చేసే బుద్ధి కావాలి. ముఖ్యమైన పురుషార్థము స్మృతియాత్ర. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వినిపించడానికి పెద్ద విషయముగా ఉంటుంది కానీ బుద్ధిలోనైతే సూక్ష్మముగా ఉంది కదా. శివబాబా రూపమేమిటి అనేది లోలోపల తెలుసు. అర్థం చేయించేందుకు పెద్ద రూపములా కనిపిస్తుంది. భక్తి మార్గములో పెద్ద లింగాన్ని తయారుచేస్తారు. ఆత్మ అయితే చిన్నది కదా, ఇది సృష్టి అద్భుతము. ఎప్పటికని పాత్ర అంతమవుతుంది? చివరికి ఇక అంతము లేనిది అని అంటారు. మొత్తము పాత్ర అంతా ఆత్మలో నిండి ఉందని బాబా అర్థం చేయించారు. ఇది సృష్టి అద్భుతము. ఆ పాత్ర గురించి సంపూర్ణముగా తెలుసుకోలేరు. సృష్టి చక్రము గురించైతే సంపూర్ణముగా తెలుసుకోగలరు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి మీకే తెలుసు. బాబా నాలెడ్జ్ ఫుల్, తర్వాత మనము కూడా నాలెడ్జ్ లో ఫుల్ అయిపోతాము. ఇక పొందడానికంటూ ఏమీ మిగలదు. తండ్రి వీరిలో ప్రవేశించి చదివిస్తారు. వారు ఒక బిందువు. ఆత్మ లేక పరమాత్మ యొక్క సాక్షాత్కారము కలగడముతో సంతోషమేమీ కలగదు. కృషి చేసి తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి అంటారు, నాలో జ్ఞానము పూర్తి అయిపోయినప్పుడు మీలో కూడా పూర్తి అయిపోతుంది. జ్ఞానాన్ని తీసుకుని ఉన్నతముగా తయారైపోతారు. అంతా తీసేసుకుంటారు కానీ ఎంతైనా తండ్రి తండ్రే కదా. ఆత్మలైన మీరు ఆత్మలుగానే ఉంటారు, తండ్రిగా అయితే అవ్వరు. ఇది జ్ఞానము. తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే. ఇవన్నీ విచార సాగర మంథనము చేసి లోతుల్లోకి వెళ్ళవలసిన విషయాలు. అందరూ వెళ్ళవలసిందే అనేది కూడా తెలుసు. అందరూ వెళ్ళిపోయేవారే. ఆత్మ మాత్రము అక్కడికి వెళ్ళి ఉంటుంది. మొత్తము ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నది. ఇందులో నిర్భయులుగా ఉండవలసి ఉంటుంది. నిర్భయులుగా ఉండగలగడానికి పురుషార్థము చేయాలి. శరీరము మొదలైనవాటి భానమేదీ కలగకూడదు. ఆ అవస్థకు చేరుకోవాలి. తండ్రి తమ సమానముగా తయారుచేస్తారు, పిల్లలైన మీరు కూడా మీ సమానముగా తయారుచేస్తూ ఉంటారు. ఒక్క తండ్రి స్మృతే ఉండాలి, ఆ విధముగా పురుషార్థము చేయాలి. ఇప్పుడు ఇంకా సమయముంది. ఈ రిహార్సల్స్ ను తీవ్రతరము చేయాలి. అభ్యాసము లేకపోతే అక్కడే ఆగిపోతారు. కాళ్ళు వణకడము మొదలవుతుంది మరియు అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. తమోప్రధాన శరీరానికి హార్ట్ ఫెయిల్ అవ్వడములో సమయము పట్టదు. ఎంతగా అశరీరిగా అవుతూ ఉంటారో, తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా సమీపముగా వస్తూ ఉంటారు. యోగము చేసేవారే నిర్భయులుగా ఉంటారు. యోగము ద్వారా శక్తి లభిస్తుంది, జ్ఞానము ద్వారా ధనము లభిస్తుంది. పిల్లలకు కావాల్సింది శక్తి. కావున శక్తిని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బాబా అవినాశీ సర్జన్. వారు ఎప్పుడూ పేషెంట్ గా అవ్వలేరు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు మీ అవినాశీ ఔషధాన్ని తీసుకుంటూ ఉండండి. నేను మీకు ఎటువంటి సంజీవని మూలికను ఇస్తానంటే, ఇక మళ్ళీ ఎప్పుడూ ఎవ్వరూ రోగులుగా అవ్వరు. కేవలం పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పావనముగా అయిపోతారు. దేవతలు సదా నిరోగీగా, పావనముగా ఉంటారు కదా. మేము కల్ప-కల్పము వారసత్వము తీసుకుంటామని పిల్లలకు ఈ విషయములోనైతే నిశ్చయము ఏర్పడింది. ఇప్పుడు ఎలా వచ్చారో, అలాగే బాబా లెక్కలేనన్ని సార్లు వచ్చారు. బాబా ఏదైతే నేర్పిస్తున్నారో, ఏదైతే అర్థం చేయిస్తున్నారో, అదే రాజయోగము. ఆ గీత మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఈ జ్ఞాన మార్గము గురించి తండ్రే తెలియజేస్తారు. తండ్రియే వచ్చి కింద నుండి పైకి ఎత్తుతారు. పక్కా నిశ్చయబుద్ధి కలిగినవారు ఎవరైతే ఉన్నారో, వారే మాలలోని మణులుగా అవుతారు. భక్తి చేస్తూ-చేస్తూ మేము కింద పడిపోతూ వచ్చామని పిల్లలు భావిస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమైన సంపాదనను చేయిస్తారు. పారలౌకిక తండ్రి ఎంతైతే సంపాదనను చేయిస్తారో, లౌకిక తండ్రి అంత చేయించరు. అచ్ఛా, పిల్లలకు గుడ్ నైట్ మరియు నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాయ పహల్వాన్ (వస్తాదు) గా అయి మీ ముందుకు వస్తుంది, దానికి భయపడకూడదు. మాయాజీతులుగా అవ్వాలి. అడుగడుగులోనూ శ్రీమతముపై నడుస్తూ మీపై మీరే కృప చూపించుకోవాలి.

2. తండ్రికి మీ సత్యాతి-సత్యమైన లెక్కాపత్రాన్ని తెలియజేయాలి. ట్రస్టీలుగా అయి ఉండాలి. నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేసే అభ్యాసము చేయాలి.

వరదానము:- ఆత్మిక గులాబీలుగా అయి దూరదూరాల వరకు ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపజేసే ఆత్మిక సేవాధారీ భవ
ఆత్మిక గులాబీలు తమ ఆత్మిక వృత్తి ద్వారా ఆత్మికత యొక్క సుగంధాన్ని దూరదూరాల వరకు వ్యాపింపజేస్తారు. వారి దృష్టిలో సదా సుప్రీమ్ ఆత్మ ఇమిడి ఉంటారు. వారు సదా ఆత్మనే చూస్తారు, ఆత్మతోనే మాట్లాడుతారు. నేను ఆత్మను, సదా సుప్రీమ్ ఆత్మ యొక్క ఛత్రఛాయలో నడుస్తున్నాను, ఆత్మనైన నాతో చేయించేవారు సుప్రీమ్ ఆత్మ - ఈ విధముగా ప్రతి క్షణము తండ్రిని హాజరుగా ఉన్నట్లు అనుభవం చేసుకునేవారే సదా ఆత్మిక సుగంధములో అవినాశీగా మరియు ఏకరసముగా ఉంటారు. ఇదే ఆత్మిక సేవాధారుల నంబర్ వన్ విశేషత.
స్లోగన్:- నిర్విఘ్నులుగా అయి సేవలో ముందు నంబరును తీసుకోవడము అనగా నంబర్ వన్ భాగ్యశాలిగా అవ్వడము.

 

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

బ్రాహ్మణ జీవితములో దేహ బంధనము, సంబంధాల బంధనము, సాధనాల బంధనము - అన్నీ సమాప్తమైపోయాయి కదా! ఎటువంటి బంధనము లేదు. బంధనము తన వశము చేసుకుంటుంది మరియు సంబంధము స్నేహము యొక్క సహయోగాన్ని ఇస్తుంది. కావున దేహ సంబంధీకులతో దేహము పరంగా సంబంధముగా కాదు కానీ ఆత్మిక సంబంధము ఉన్నట్లు. ఇటువంటి బ్రాహ్మణులు అనగా జీవన్ముక్తులు.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.