తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 7 అక్టోబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి7 అక్టోబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

07-10-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - తండ్రి పిల్లలైన మిమ్మల్ని కుంభీపాక నరకము నుండి బయటకు తీయడానికి వచ్చారు, పిల్లలైన మీరు తండ్రికి ఆహ్వానము కూడా దీని కోసమే ఇచ్చారు’’
ప్రశ్న:- పిల్లలైన మీరు చాలా గొప్ప కార్మికులు, అది ఎలా? మీ పనితనము ఏమిటి?
జవాబు:- పిల్లలైన మనము ఎటువంటి పని చేస్తామంటే, దానితో మొత్తం ప్రపంచమంతా కొత్తగా అయిపోతుంది, దాని కోసం మనమేమీ ఇటుకలు, తట్టలు ఎత్తము. కానీ స్మృతియాత్ర ద్వారా కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తారు. మనము కొత్త ప్రపంచము యొక్క నిర్మాణాన్ని చేస్తున్నాము అని మనకు సంతోషము ఉంది. మనమే మళ్ళీ ఇటువంటి స్వర్గానికి యజమానులుగా అవుతాము.

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. మీరు మీ-మీ ఊళ్ళ నుండి బయలుదేరేటప్పుడు మేము శివబాబా పాఠశాలకు వెళ్తున్నాము అని బుద్ధిలో ఉంటుంది. మీరేమీ ఎవరో సాధు-సన్యాసులు మొదలైనవారిని దర్శించుకునేందుకు లేక శాస్త్రాలు మొదలైనవి వినేందుకు వస్తారని కాదు. మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము అని మీకు తెలుసు. ప్రపంచములోని మనుష్యులైతే శివుడు పైన ఉంటారు అని భావిస్తారు. వారు స్మృతి చేసేటప్పుడు కళ్ళు తెరుచుకుని కూర్చోరు. వారు కళ్ళు మూసుకుని ధ్యానములో కూర్చుంటారు. శివలింగాన్ని చూసి ఉంటారు, వారు శివాలయములోకి వెళ్ళినా కానీ శివుడిని తలచుకున్నప్పుడు పైకి చూస్తారు లేక మందిరమే గుర్తుకువస్తుంది. కొందరేమో కళ్ళు మూసుకుని కూర్చుంటారు. దృష్టి ఎక్కడైనా నామ-రూపాలలోకి వెళ్ళినట్లయితే మా సాధన ఖండితమైపోతుంది అని భావిస్తారు. మనము కూడా భక్తిలో శివబాబాను తలచుకునేవారము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కొందరు శ్రీకృష్ణుడిని తలచుకుంటారు, కొందరు రాముడిని తలచుకుంటారు, కొందరు తమ గురువును తలచుకుంటారు. గురువు యొక్క చిన్న లాకెట్ ను తయారుచేసుకుని ధరిస్తారు. గీత యొక్క చిన్న లాకెట్ ను కూడా తయారుచేసుకుని ధరిస్తారు. భక్తి మార్గములోనైతే అందరూ ఇలాగే ఉంటారు. ఇంట్లో కూర్చుని కూడా తలచుకుంటూ ఉంటారు. అలా తలచుకుంటూ యాత్రలకు కూడా వెళ్తారు. చిత్రాలనైతే ఇంట్లో పెట్టుకునైనా పూజ చేయవచ్చు, కానీ ఇది కూడా భక్తిలో ఒక ఆచారముగా ఏర్పడిపోయింది. జన్మ-జన్మాంతరాలూ యాత్రలకు వెళ్తారు. నాలుగు ధామాల యాత్రలు చేస్తారు. నాలుగు ధామాలు అని ఎందుకు అంటారు? పడమర, తూర్పు, ఉత్తరం, దక్షిణం, నలువైపులా చుట్టి వస్తారు. భక్తి మార్గము ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు మొదట ఒక్కరి భక్తినే చేయడం జరుగుతుంది, దానిని అవ్యభిచారీ భక్తి అని అంటారు. సతోప్రధానముగా ఉండేవారు, ఇప్పుడైతే ఈ సమయములో తమోప్రధానముగా ఉన్నారు. భక్తి కూడా వ్యభిచారీగా ఉంది, అనేకులను తలచుకుంటూ ఉంటారు. తమోప్రధానమైన పంచ తత్వాలతో తయారుచేయబడిన శరీరాన్ని కూడా పూజిస్తూ ఉంటారు అనగా తమోప్రధాన తత్వాలను పూజ చేస్తున్నట్లే, కానీ ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు. ఇక్కడ కూర్చుని ఉన్నా కానీ బుద్ధియోగము ఎక్కడో భ్రమిస్తూ ఉంటుంది. ఇక్కడైతే పిల్లలైన మీరు శివబాబాను కళ్ళు మూసుకుని స్మృతి చేయకూడదు. తండ్రి ఎంతో దూరదేశ నివాసి అని మీకు తెలుసు. వారు వచ్చి పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తారు. శ్రీమతముపై నడవడం ద్వారానే శ్రేష్ఠ దేవతలుగా అవుతారు. దేవతల రాజధాని అంతా స్థాపన అవుతోంది. మీరు ఇక్కడ కూర్చుని మీ దేవీ-దేవతల రాజ్యాన్ని స్థాపన చేస్తారు. అది ఎలా స్థాపన అవుతుందు అనేది ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు - బాబా మనకు తండ్రి కూడా, వారు టీచరుగా అయి చదివిస్తారు మరియు తమతోపాటు తీసుకువెళ్తారు కూడా, సద్గతిని ఇస్తారు. గురువులు ఎవరికీ సద్గతిని ఇవ్వరు. వీరు ఒక్కరే తండ్రి, టీచరు మరియు సద్గురువు అని ఇక్కడ మీకు అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది, సద్గురువు పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్తారు. ఈ విషయాలన్నింటినీ వృద్ధ మాతలైతే అర్థం చేసుకోలేరు. వారికి ముఖ్యమైన విషయమేమిటంటే - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాను స్మృతి చేయాలి. మనం శివబాబా పిల్లలము, మనకు బాబా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. వృద్ధ మాతలకు ఇలా-ఇలా సరళ భాషలో అర్థం చేయించాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడమనేది ప్రతి ఆత్మ యొక్క హక్కు. మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది. పాత ప్రపంచము మళ్ళీ తప్పకుండా కొత్తగా అవ్వనున్నది, కొత్తది మళ్ళీ పాతగా అవుతుంది. ఇల్లు తయారవ్వడానికి కొన్ని నెలలే పడుతుంది, అది మళ్ళీ పాతగా అవ్వడానికి 100 సంవత్సరాలు పడుతుంది.

ఈ పాత ప్రపంచము ఇప్పుడు అంతమవ్వనున్నదని పిల్లలైన మీకు తెలుసు. ఈ యుద్ధమేదైతే ఇప్పుడు మొదలవుతుందో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ వృద్ధ మాతలు అర్థం చేసుకోలేరు. మరి వారికి అర్థం చేయించడం బ్రాహ్మణీల పని. వారికైతే ఈ ఒక్క మాటే చాలు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఆత్మలైన మీరు పరంధామ నివాసులు. ఇక్కడ మళ్ళీ శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తారు. ఆత్మ ఇక్కడ దుఃఖము మరియు సుఖము యొక్క పాత్రను అభినయిస్తుంది. తండ్రి చెప్పే ముఖ్యమైన విషయమేమిటంటే - నన్ను స్మృతి చేయండి మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా పాపాలు అంతమైపోతాయి మరియు మళ్ళీ స్వర్గములోకి వస్తారు. ఇప్పుడు ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు అంతమవుతాయి. వృద్ధ మాతలైతే ఎంతో అలవాటు పడిపోయి ఉన్నారు, సత్సంగాలకు వెళ్ళి కథలు వింటారు. వారికి ఘడియ-ఘడియ తండ్రి స్మృతిని కలిగించాలి. స్కూల్లోనైతే చదివించడం జరుగుతుందే కానీ కథలు వినిపించడం జరగదు. భక్తి మార్గములోనైతే మీరు ఎన్నో కథలు విన్నారు, కానీ దాని వల్ల ఎటువంటి లాభమూ కలగదు. అశుద్ధమైన ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి వెళ్ళలేరు. మనుష్యులకు రచయిత అయిన తండ్రి గురించి గాని, అలాగే రచనను గురించి గాని తెలియదు. మాకు తెలియదు, తెలియదు అని అంటూ ఉంటారు. మీకు కూడా ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు మీరు భక్తి మార్గాన్ని బాగా తెలుసుకున్నారు. ఇళ్ళలో కూడా చాలామంది వద్ద విగ్రహాలు ఉంటాయి, చిత్రమైతే అదే. కొందరు పతులు తమ పత్నితో ఇలా అంటారు - నీవు ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకుని పూజించు, బయటకు వెళ్ళి ఎందుకు భ్రమిస్తావు? కానీ వారికి భావన ఉంటుంది. తీర్థ యాత్రలు చేయడం అనగా భక్తి మార్గపు ఎదురుదెబ్బలు తినడమేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అనేక సార్లు మీరు 84 జన్మల చక్రములో తిరిగారు. సత్య, త్రేతాయుగాలలోనైతే ఎటువంటి యాత్రలూ ఉండవు. అక్కడ ఎటువంటి మందిరాలు మొదలైనవి ఉండవు. ఈ యాత్రలు మొదలైనవన్నీ భక్తి మార్గములోనే ఉంటాయి. జ్ఞాన మార్గములో ఇవన్నీ ఉండవు. దానిని భక్తి అని అంటారు. జ్ఞానాన్ని ఇచ్చేవారైతే ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. సద్గతిదాత ఒక్క తండ్రే. శివబాబాను ఎవరూ శ్రీశ్రీ అని అనరు, వారికి టైటిల్ యొక్క అవసరం లేదు. కేవలం అలా మహిమ చేస్తారు. వారిని శివబాబా అనే అంటారు. శివబాబా, మేము పతితులుగా అయిపోయాము, మీరు వచ్చి మమ్మల్ని పావనులుగా తయారుచేయండి అని మీరు పిలుస్తారు. భక్తి మార్గపు ఊబిలో గొంతు వరకూ చిక్కుకుపోయారు. అలా చిక్కుకుపోయి ఇక ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. విషయ-వాసనల ఊబిలో పూర్తిగా చిక్కుకుపోతారు. మెట్లు దిగుతూ, దిగుతూ చిక్కుకుపోతారు. ఇది ఎవరికీ తెలియదు, అందుకే తండ్రీ, మమ్మల్ని బయటకు తీయండి అని అంటారు. బాబాకు కూడా డ్రామానుసారంగా రావలసి ఉంటుంది. తండ్రి అంటారు, నేను వీరందరినీ ఊబి నుండి బయటకు తీసేందుకు బంధించబడి ఉన్నాను. దీనిని కుంభీపాక నరకము అని అంటారు. రౌరవ నరకము అని కూడా అంటారు. ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, వారికి ఇవేవీ తెలియవు.

మీరు తండ్రికి ఎటువంటి ఆహ్వానాన్ని ఇస్తారో చూడండి. ఆహ్వానము అనేది ఏదైనా వివాహము మొదలైనవాటికి ఇవ్వడం జరుగుతుంది. మీరు అంటారు - ఓ పతితపావన బాబా, ఈ పతిత ప్రపంచములోకి, రావణుని పాత ప్రపంచములోకి రండి. మనము ఇందులో గొంతు వరకూ చిక్కుకుని ఉన్నాము. తండ్రి తప్ప ఇంకెవ్వరూ దీని నుండి బయటకు తీయలేరు. దూరదేశ నివాసి అయిన శివబాబా అని కూడా అంటారు, ఇది రావణుని దేశము. అందరి ఆత్మా తమోప్రధానముగా అయిపోయింది, అందుకే మీరు వచ్చి పావనంగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా. పతిత-పావన సీతారామ్ అని ఇలా గానం చేస్తూ అరుస్తూ ఉంటారు. అలాగని వారు పవిత్రంగా ఉంటారని కాదు. ఈ ప్రపంచమే పతితమైనది, ఇది రావణ రాజ్యము, ఇందులో మీరు చిక్కుకుని ఉన్నారు. మళ్ళీ ఈ ఆహ్వానమును ఇచ్చారు - బాబా, మీరు వచ్చి మమ్మల్ని ఈ కుంభీపాక నరకము నుండి బయటకు తీయండి అని. కావున తండ్రి వచ్చి ఉన్నారు. వారు మీకు ఎంత వినమ్రులైన సేవకులు. డ్రామాలో పిల్లలైన మీరు అపారమైన దుఃఖాన్ని చూసారు. సమయం గతిస్తూ ఉంటుంది. ఒక్క క్షణము ఇంకొక క్షణముతో కలవదు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని లక్ష్మీ-నారాయణుల్లా తయారుచేస్తారు, ఆ తర్వాత మీరు అర్ధకల్పం రాజ్యం చేస్తారు, దీనిని స్మృతిలోకి తెచ్చుకోండి. ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది. మృత్యువు ప్రారంభమైతే మనుష్యులు తికమకపడిపోతారు. కొద్ది సమయంలోనే ఏమేమో జరుగుతుంది. కొందరు పెద్ద శబ్దం విని కూడా హార్ట్ ఫెయిల్ అయిపోతారు. ఎలా చనిపోతారంటే ఇక వర్ణించడానికి వీల్లేనట్లుగా ఉంటుంది. చూడండి, ఎంతోమంది వృద్ధ మాతలు వచ్చారు, పాపం వీరు ఏమీ అర్థం చేసుకోలేరు. తీర్థ యాత్రలకు వెళ్తారు కదా, అలా ఒకరిని చూసి ఒకరు మేము కూడా వెళ్తాము అని సిద్ధమైపోతారు.

ఇప్పుడు మీకు తెలుసు - భక్తి మార్గములోని తీర్థ యాత్రల అర్థమే కిందకు దిగజారడం, తమోప్రధానముగా అవ్వడము. మీకు అన్నింటికన్నా పెద్ద యాత్ర ఏమిటంటే - మీరు పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచములోకి వెళ్తారు. కావున ఈ కుమార్తెలకు ఎంతోకొంత శివబాబా స్మృతిని కలిగిస్తూ ఉండండి. శివబాబా పేరు గుర్తుందా? ఎంతోకొంత వింటే స్వర్గములోకి వస్తారు. ఈ ఫలము తప్పకుండా లభించనున్నది. ఇకపోతే పదవి అయితే చదువుతో లభిస్తుంది. అందులో చాలా తేడా వచ్చేస్తుంది. పదవి ఉన్నతోన్నతమైనది మరియు తక్కువలో తక్కువది కూడా లభిస్తుంది. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ, నౌకర్లు ఎక్కడ. రాజధానిలో నంబరువారుగా ఉంటారు. స్వర్గములో కూడా రాజధాని ఉంటుంది. కానీ అక్కడ పాపాత్ములు, అశుద్ధమైన వికారులు ఉండరు. అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము. మేము ఈ లక్ష్మీ-నారాయణుల వలె తప్పకుండా అవుతాము అని మీరు అంటారు. మీరు చేతులెత్తడం చూసి ఈ వృద్ధ మాతలు మొదలైనవారందరూ కూడా చేతులెత్తేస్తారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఎంతైనా తండ్రి వద్దకు వచ్చారు కావున స్వర్గములోకి అయితే వెళ్తారు, కానీ అందరూ అలా అయితే తయారవ్వరు కదా. ప్రజలుగా కూడా తయారవుతారు. తండ్రి అంటారు, నేను పేదల పాలిటి పెన్నిధిని, కావున బాబా పేదలను చూసి సంతోషిస్తారు. ఎంత గొప్ప షావుకార్లు, పదమపతులు అయినా కానీ, వారి కన్నా వీరు ఉన్నత పదవిని పొందుతారు, 21 జన్మల కొరకు. ఇది కూడా మంచిదే. వృద్ధ మాతలు వచ్చినప్పుడు తండ్రికి సంతోషం కలుగుతుంది, ఎంతైనా శ్రీకృష్ణపురిలోకి అయితే వెళ్తారు కదా. ఇది రావణపురి. ఎవరైతే బాగా చదువుతారో వారు శ్రీకృష్ణుడిని కూడా తమ ఒడిలో ఊపుతారు. ప్రజలైతే లోపలికి రాలేరు కదా. వారైతే ఎప్పుడో ఒకప్పుడు దర్శనం చేసుకుంటారు. ఉదాహరణకు పోప్ కిటికీ నుండి అందరికీ దర్శనమిస్తారు కదా, అప్పుడు వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది వచ్చి పోగవుతారు. కానీ వారిని మనమేమి దర్శనం చేసుకుంటాము. సదా పావనులు అయితే ఒక్క తండ్రే, వారు వచ్చి మిమ్మల్ని పావనంగా తయారుచేస్తారు. మొత్తం విశ్వమంతటినీ సతోప్రధానముగా తయారుచేస్తారు. అక్కడ ఈ ఐదు భూతాలూ ఉండవు. పంచ తత్వాలు కూడా సతోప్రధానముగా అయిపోతాయి, మీకు దాసులుగా అయిపోతాయి. ఏదైనా నష్టం వాటిల్లేలా ఇటువంటి వేడి కూడా ఎప్పుడూ ఉండదు. పంచ తత్వాలు కూడా నియమానుసారంగా నడుచుకుంటాయి. అకాల మృత్యువులు ఉండవు. ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్తారు కావున నరకము నుండి బుద్ధియోగాన్ని తొలగించుకోవాలి. కొత్త ఇంటిని నిర్మించేటప్పుడు పాతదాని నుండి బుద్ధి తొలగిపోతుంది. బుద్ధి కొత్త ఇంటి వైపుకు వెళ్ళిపోతుంది, అలా ఇది అనంతమైన విషయము. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది, పాతది వినాశనమవ్వనున్నది. మీరు కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారుచేస్తారు. మీరు చాలా మంచి కార్మికులు. మీరు మీ కొరకు స్వర్గాన్ని తయారుచేసుకుంటున్నారు. మీరు ఎంత గొప్ప మంచి కార్మికులు, స్మృతియాత్రతో కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారుచేస్తారు. కొద్దిగా స్మృతి చేసినా స్వర్గములోకి వచ్చేస్తారు. మీరు గుప్త వేషములో మీ స్వర్గాన్ని తయారుచేసుకుంటున్నారు. మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి ఇక స్వర్గములో నివసిస్తాము అని మీకు తెలుసు. కావున ఇటువంటి అనంతమైన తండ్రిని మర్చిపోకూడదు. ఇప్పుడు మీరు స్వర్గములోకి వెళ్ళేందుకు చదువుకుంటున్నారు. మీ రాజధానిని స్థాపించుకునేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఈ రావణుని రాజధాని అంతమైపోనున్నది. కావున లోలోపల ఎంతటి సంతోషము ఉండాలి. మనము ఈ స్వర్గాన్ని అయితే అనేక సార్లు తయారుచేసాము, రాజ్యము తీసుకున్నాము, మళ్ళీ పోగొట్టుకున్నాము. ఇది గుర్తు చేసుకున్నా చాలా మంచిది. మనం స్వర్గాధిపతులుగా ఉండేవారము, తండ్రి మనల్ని ఆ విధంగా తయారుచేసారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి. ఎంత సహజ రీతిలో మీరు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. పాత ప్రపంచ వినాశనం కొరకు ఎన్ని వస్తువులు వెలువడుతూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, మిసైల్స్ మొదలైనవాటి ద్వారా మొత్తం పాత ప్రపంచమంతా అంతమైపోతుంది. ఇప్పుడు తండ్రి మీకు శ్రేష్ఠ మతాన్ని ఇవ్వడానికి, శ్రేష్ఠ స్వర్గాన్ని స్థాపన చేయడానికి వచ్చారు. అనేక సార్లు మీరు ఈ స్థాపనను చేసారు కావున దీనిని బుద్ధిలో గుర్తుంచుకోవాలి. అనేక సార్లు రాజ్యాన్ని తీసుకున్నారు, మళ్ళీ పోగొట్టుకున్నారు. ఇది బుద్ధిలో నడుస్తూ ఉండాలి మరియు ఒకరికొకరు కూడా ఈ విషయాలను వినిపించుకోండి. ప్రాపంచిక విషయాలలో సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. తండ్రిని స్మృతి చేయండి, స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. ఇక్కడ పిల్లలు బాగా విని మళ్ళీ దీనిని చాలా నెమరువేయాలి, బాబా ఏం వినిపించారు అని స్మరణ చేయాలి. శివబాబాను మరియు వారసత్వాన్ని అయితే తప్పకుండా స్మృతి చేయాలి. తండ్రి అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చారు, పవిత్రముగా కూడా అవ్వాలి. పవిత్రముగా అవ్వకపోతే శిక్షలను అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా చాలా తక్కువది పొందుతారు. స్వర్గములో ఉన్నత పదవిని పొందాలంటే చాలా బాగా ధారణ చేయండి. తండ్రి మార్గమైతే ఎంతో సహజమైనది తెలియజేస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని బాగా విని మళ్ళీ నెమరువేయాలి. ప్రాపంచిక విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు.

2. తండ్రిని స్మృతి చేసేటప్పుడు కళ్ళు మూసుకుని కూర్చోకూడదు. శ్రీకృష్ణుని రాజధానిలోకి వచ్చేందుకు చదువును బాగా చదవాలి.

వరదానము:- మనస్సు-బుద్ధిని జంజాటాల నుండి దూరం చేసి మిలన మేళాను జరుపుకునే జంజాటాల నుండి ముక్త భవ
కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే - ఈ జంజాటం పూర్తయిందంటే మా అవస్థ లేక సేవ మంచిగా అయిపోతుంది అని. కానీ జంజాటాలు పర్వతములాంటివి. పర్వతము కదలదు, కానీ ఎక్కడైతే జంజాటము ఉంటుందో అక్కడి నుండి మీ మనసు-బుద్ధిని దూరం చెయ్యండి లేక ఎగిరే కళతో జంజాటమనే పర్వతము కంటే కూడా పైకి వెళ్ళిపోండి, అప్పుడు పర్వతము కూడా మీకు సహజంగా అనుభవమవుతుంది. జంజాటాల ప్రపంచములో జంజాటాలైతే వస్తూనే ఉంటాయి, మీరు ముక్తులుగా ఉన్నట్లయితే మిలన మేళాను జరుపుకోగలరు.
స్లోగన్:- ఈ అనంతమైన నాటకములో హీరో పాత్రను పోషించేవారే హీరో పాత్రధారులు.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.