తెలుగు మురళి · Brahma Kumaris

ఈరోజు మురళి · 16 నవంబర్, 2026

ఓం శాంతి · BapDada · 16 నవంబర్, 2026

ఈరోజు మురళి — ప్రతి ఉదయం కొత్తది.

18
డౌన్‌లోడ్ PDF
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

16-11-2026
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - మీ నడవడిక చాలా-చాలా మధురముగా, రాయల్ గా ఉండాలి, క్రోధమనే భూతము అస్సలు ఉండకూడదు’’
ప్రశ్న:- 21 జన్మల ప్రారబ్ధాన్ని పొందేందుకు పిల్లలు ఏ విషయము పట్ల తప్పకుండా అటెన్షన్ పెట్టాలి?
జవాబు:- ఈ ప్రపంచములో ఉంటూ, అన్నీ చేస్తూ, బుద్ధి యోగము ఒక్క సత్యమైన ప్రియునితో ఉండాలి. తండ్రి గౌరవము పోగొట్టే విధముగా ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు. ఇంటిలో ఉంటూ కూడా ఎంత ప్రేమగా ఉండండి అంటే, వీరిలో చాలా మంచి దైవీ గుణాలు ఉన్నాయని ఇతరులకు అనిపించాలి.
పాట:- మేలుకోండి ప్రేయసులారా మేలుకోండి...

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. పాట అర్థాన్ని కూడా పిల్లలు తప్పకుండా అర్థం చేసుకుని ఉంటారు. తండ్రి వచ్చి కొత్త-కొత్త విషయాలను వినిపిస్తారు. కొత్త ప్రపంచము యొక్క కొత్త యుగానికి సంబంధించిన ఈ విషయాలను పిల్లలు 5 వేల సంవత్సరాల క్రితం విన్నారు. ఇప్పుడు మళ్ళీ వింటున్నారు. ఇకపోతే మధ్యలో కేవలం భక్తి మార్గానికి సంబంధించిన విషయాలను మాత్రమే విన్నారు. సత్యయుగములో ఈ విషయాలు ఉండవు. అక్కడ ఉన్నది జ్ఞాన మార్గము యొక్క ప్రారబ్ధము. ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచము కోసం సత్యమైన సంపాదనను చేసుకుంటున్నారు. నాలెడ్జ్ ను సోర్స్ ఆఫ్ ఇన్ కమ్ (జ్ఞానము సంపాదనకు ఆధారము) అని అంటారు. చదువు ద్వారా కొందరు బ్యారిస్టర్లు, కొందరు ఇంజినీర్లు మొదలైనవారిగా అవుతారు. సంపాదన కూడా జరుగుతుంది. మీరు ఈ చదువు ద్వారా రాజులకే రాజులుగా అవుతారు. ఇది ఎంత గొప్ప సంపాదన. ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయముంది, ఒకవేళ కొద్దిగా సంశయమున్నా సరే, మున్ముందు నిశ్చయము ఏర్పడుతూ ఉంటుంది. క్షణములో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు. బాబాకు చెందినవారిగా అయ్యారంటే వారసత్వానికి యజమానులుగా అయినట్లు. స్వర్గ రచయిత అయిన తండ్రి మనల్ని యజమానులుగా తయారుచేయడానికి వచ్చారు, ఈ విషయములో పిల్లలకు నిశ్చయముండాలి. ఇద్దరు తండ్రులు ఉన్నారని కూడా మీకు తెలుసు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి, వారిని - పరమపిత పరమాత్మ, ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని ఎప్పుడూ ‘పరమపిత’ అని అనరు. సర్వుల సుఖదాత, శాంతిదాత ఆ ఒక్క పారలౌకిక తండ్రి మాత్రమే. సత్యయుగములో అందరూ సుఖముగా ఉంటారు, మిగిలిన ఆత్మలు శాంతిధామములో ఉంటారు. సత్యయుగములో మీకు సుఖ-శాంతులు, ధన-సంపదలు, నిరోగి శరీరము, అన్నీ ఉండేవి. అటువంటి అతి ప్రియమైన తండ్రిని అందరూ పిలుస్తారు. సాధు-సత్పురుషులు కూడా సాధన చేస్తారు, కానీ ఎవరి కోసం సాధన చేస్తున్నారు అనేది వారికి తెలియదు. వారు బ్రహ్మతత్వము కోసం సాధన చేస్తారు, బ్రహ్మతత్వములో లీనమవ్వాలని అనుకుంటారు కానీ లీనమవ్వలేరు. బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తే పాపాలు తొలగవు. తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. సర్వశక్తివంతుడిని నేనా లేక నివసించే స్థానమైన బ్రహ్మతత్వమా? బ్రహ్మ మహాతత్వములో ఆత్మలందరూ నివసిస్తారు. వారు బ్రహ్మతత్వాన్ని భగవంతుడని భావించారు. ఎలాగైతే భారతవాసులు హిందుస్థాన్ లో ఉన్న కారణముగా తమది హిందు ధర్మమని భావించారో, అలా నివసించే స్థానమైన బ్రహ్మతత్వాన్ని పరమాత్మగా భావించారు, అది బ్రహ్మాండము. అక్కడ జ్యోతిర్బిందువు అయిన ఆత్మలు, అండాకారములో ఉంటాయి, అందుకే దానిని ‘బ్రహ్మాండము’ అని అంటారు. ఇది మనుష్య సృష్టి. బ్రహ్మాండము వేరు, మనుష్య సృష్టి వేరు. ఆత్మ అంటే ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రము మెరుస్తుంది... అని అంటారు కూడా. మళ్ళీ, ఆత్మ అంగుష్ఠాకారములో ఉంటుందని మరికొందరు అంటారు. కానీ తండ్రి అంటారు - ఆత్మ పూర్తిగా సూక్ష్మమైన బిందువు, దానిని ఈ నేత్రాలతో చూడలేరు. ఆత్మను చూసేందుకు, పట్టుకునేందుకు చాలా ప్రయత్నిస్తారు. కానీ ఎవ్వరికీ తెలియదు.

పిల్లలైన మీకు తెలుసు - ఇప్పుడు మీరు భారత్ ను స్వర్గముగా తయారుచేయడములో తండ్రికి సహాయకులుగా కూడా అవ్వాలి. తండ్రి వచ్చేదే భారత్ లో. శివజయంతిని భారత్ లోనే జరుపుకుంటారు. క్రైస్టు వచ్చి వెళ్ళారు కనుక క్రిస్టియన్లు క్రిస్టమస్ పండుగను జరుపుకుంటారు. క్రైస్టు ఎప్పుడు వచ్చారు అనేది కూడా వారికి తెలుసు. కానీ భారతవాసులకు తండ్రి ఎప్పుడు వచ్చారు, శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చారు అనేది తెలియనే తెలియదు. ఎవరి గురించి వారికి తెలియదు. అందరూ శ్రీకృష్ణుడి మహిమనే చేస్తారు. అతడిని ఊయలలో ఊపుతారు, ప్రేమిస్తారు కానీ అతని జన్మ ఎప్పుడు జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు. ద్వాపరములో గీతను వినిపించారని అంటారు. కానీ శ్రీకృష్ణుడు ద్వాపరములోనైతే రారు. లీల అంతా ఒక్క తండ్రిదే. అందుకే వారి గురించి - మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము మీకే తెలుసు అని అంటారు. శ్రీకృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. యోగబలముతో పుత్రుడు జన్మించబోతున్నాడని ముందు నుండే తల్లికి సాక్షాత్కారమవుతుంది. అక్కడ శరీరాన్ని కూడా అలాగే వదులుతారు, సర్పము వలె ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. వాస్తవానికి సన్యాసులు ఈ ఉదాహరణను ఇవ్వలేరు. మీరు కూర్చుని వికారీ మనుష్యులకు జ్ఞానాన్ని భూ-భూ చేసి, తమోప్రధానము నుండి సతోప్రధానముగా తయారుచేస్తారు. భూ-భూ చేసి మనుష్యులను దేవతలుగా తయారుచేయడము మీ వ్యాపారము. తాబేలు మొదలైన ఉదాహరణలు కూడా ఈ సమయానికి చెందినవే. కర్మలు చేసిన తర్వాత ఎంత సమయము దొరికితే అంత సమయము తండ్రిని స్మృతి చేయాలి. ఇది మన అంతిమ జన్మ అని మీకు తెలుసు. ఇప్పుడు నాటకము పూర్తవ్వనున్నది. ఇది పాత శరీరము. దీనికి సంబంధించిన కర్మభోగాన్ని సమాప్తము చేసుకోవాలి. ఎప్పుడైతే సతోప్రధానముగా అవుతారో, అప్పుడిక కర్మాతీత స్థితి ఏర్పడుతుంది, ఇక తర్వాత మనం ఈ శరీరములో ఉండలేము. కర్మాతీత అవస్థకు చేరుకోగానే ఇక ఈ శరీరాన్ని విడిచిపెడతాము, ఇక యుద్ధము ప్రారంభమవుతుంది. దోమల వలె అన్ని శరీరాలు సమాప్తమై ఆత్మలు వెళ్ళిపోతాయి. పవిత్రముగా అవ్వకుండానైతే ఎవ్వరూ వెళ్ళలేరు. ఇది దుఃఖధామము, రావణుడు స్థాపించినది, మరియు రాముడు స్థాపించినది శివాలయము. వాస్తవానికి పరమాత్ముని పేరు ‘శివ’, అంతేకానీ ‘రామ’ కాదు. సత్యయుగమనే శివాలయములో అందరూ దేవతలే ఉంటారు. తర్వాత భక్తి మార్గములో శివుని విగ్రహము కోసం మందిరాలను, శివాలయాలను నిర్మిస్తారు. ఇప్పుడిది శివబాబా సింహాసనము. ఆత్మ ఈ సింహాసనముపై విరాజమానమై ఉంది. తండ్రి కూడా ఇక్కడ వీరి పక్కకు వచ్చి విరాజమానమవుతారు మరియు చదివిస్తారు. వీరిలో సదా అయితే ఉండరు. స్మృతి చేయగానే తండ్రి వస్తారు. తండ్రి అంటారు - నేను మీ అనంతమైన తండ్రిని, వారసత్వము నా నుండి మీకు లభించనున్నది, బ్రహ్మా అనంతమైన తండ్రి కాదు, అందుకే మీరు నన్ను స్మృతి చేయండి. బాబా జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు అని మధురమైన పిల్లలకు తెలుసు. కావున పిల్లలైన మీరు కూడా ప్రేమ సాగరులుగా అవ్వాలి. స్త్రీ-పురుషులు ఒకరినొకరు సత్యముగా ప్రేమించుకోరు, వారు కామ వికారాన్నే ప్రేమ అని భావిస్తారు, కానీ కామము మహాశత్రువని బాబా అన్నారు. ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది. దేవతలు నిర్వికారులుగా ఉండేవారు, అందుకే శ్రీకృష్ణుని వంటి కొడుకు లభించాలని, శ్రీకృష్ణుని వంటి పతి లభించాలని అంటారు. కృష్ణపురిని స్మృతి చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి కృష్ణపురిని స్థాపన చేస్తున్నారు. మీరు స్వయంగా శ్రీకృష్ణుని వలె లేక మోహనుడి వలె తయారవ్వవచ్చు. రాకుమార-రాకుమారీలు ఇంకా కూడా ఉంటారు. అంటే వారంతా ఇక్కడే తయారవుతున్నారు. వారి లిస్టు కూడా ఉంటుంది. మాలలో 8 మణులు కూడా ఉన్నాయి, అలాగే 108 మణులు కూడా ఉన్నాయి. మనుష్యులు 9 రత్నాల ఉంగరాన్ని ధరిస్తారు. ఇప్పుడు ఈ 8 మంది ఎవరు? మధ్యలో ఎవరున్నారు? మధురాతి మధురమైన తండ్రి ద్వారా మనం రత్నాలుగా తయారవుతున్నాము, ఇది కూడా మీకు తెలుసు. తండ్రి అంటారు - పిల్లలూ, పరస్పరములో చాలా ప్రేమగా నడుచుకోవాలి లేదంటే బాబా పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. సద్గురువును నిందింపజేసేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు. అందరికీ ఈ మంత్రాన్ని కూడా చెప్పాలి - ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే మాలిన్యము తొలగిపోతుంది అని. ఇంటిలో కూడా ఎంత ప్రేమగా నడుచుకోవాలంటే - వీరిలో క్రోధమే లేదు, చాలా ప్రేమ ఉందని ఇతరులకు కూడా అనిపించాలి. మద్యం, సిగరెట్ మొదలైనవి తాగడమనేది చాలా చెడ్డ అలవాటు, ఇటువంటి చెడు అలవాట్లు అన్నింటినీ వదిలేయాలి. దైవీ గుణాలను ఇక్కడే ధారణ చేయాలి. రాజధానిని స్థాపన చేయడములో శ్రమ ఉంటుంది. ఇతర ధర్మాలవారు రాజధానిని స్థాపన చేయరు. వారు పై నుండి పూర్తిగా చివరిలో వస్తుంటారు. మీరు 21 జన్మల ప్రారబ్ధాన్ని తయారుచేసుకుంటున్నారు, ఇందులో మాయా తుఫానులు చాలా వస్తాయి. అయినప్పటికీ పురుషార్థము చేసి దైవీ గుణాలను ధారణ చేయాలి. ఒకవేళ క్రోధముతో మాట్లాడితే, వీరిలో భూతముందని మనుష్యులంటారు. అంటే అనంతమైన తండ్రి గౌరవాన్ని పోగొట్టినట్లే. మరి అటువంటప్పుడు ఉన్నత పదవిని ఎలా పొందుతారు? చాలా మధురముగా, అనాసక్తులుగా అవ్వాలి. ఇక్కడ ఉంటూ, అన్ని చేస్తూ యోగము ప్రియునితో ఉండాలి. బాబా అన్నారు - నన్ను స్మృతి చేస్తే పాపాలు భస్మమవుతాయి. దీనినే ‘యోగాగ్ని’ అని అంటారు. ఇక్కడ హఠయోగం అవసరం లేదు. తమ శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచుకోవాలి, ఇది అత్యంత విలువైన శరీరము. భోజనము కూడా శుద్ధమైనది తినాలి. దేవతలకు భోగ్ (నైవేద్యము) ఎలా పెడతారు అనేది శ్రీనాథ ద్వారానికి వెళ్ళి చూడండి. బెంగాల్ లోనైతే కాళీ కు మేకను నైవేద్యముగా పెడతారు. వారు తమ పిత్రులకు కూడా చేపలు తినిపిస్తారు. అలా చేయకపోతే పిత్రులు కోపగించుకుంటారని వారు భావిస్తారు. ఎవరో ఈ పద్ధతిని తయారుచేసారు, అదే కొనసాగుతూ ఉంటుంది. దేవీ-దేవతల రాజ్యములో ఏ పాపము జరగదు. అది రామ రాజ్యము. ఇక్కడ కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడ కర్మలు అకర్మలుగా అవుతాయి. ఇప్పుడు హరిద్వార్ కు వెళ్ళి కూర్చుంటారు. ‘హరి’ అని శ్రీకృష్ణుడిని అంటారు. కానీ శ్రీకృష్ణుడు సత్యయుగములో ఉంటారు. వాస్తవానికి ‘హరి’ అన్న పేరు శివునిది, అంటే దుఃఖాన్ని హరించేవారు అని అర్థం. కానీ గీతలో శ్రీకృష్ణుని పేరును వేసి, హరి అంటే శ్రీకృష్ణుడని అనుకున్నారు. వాస్తవానికి దుఃఖాన్ని హరించేవారు శివబాబా. హరి ద్వారమని సత్యయుగాన్ని అంటారు. భక్తి మార్గములో ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు.

తండ్రి అంటారు - పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేయడానికి నేను సంగమయుగములో వస్తాను. రావణుడు పాత శత్రువు. ప్రతి సంవత్సరము రావణుడిని కాలుస్తారు. ఎంత ధనాన్ని ఖర్చు చేస్తారు. అంతా వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్టే ఆఫ్ మనీ (సమయము, ధనము అంతా వ్యర్థమైనట్లే). బెంగాల్ లో ఎంతమంది దేవీలను తయారుచేస్తారు, వారికి తినిపించి, తాగించి, పూజ చేసి, తర్వాత వెళ్ళి ముంచేస్తారు. దీని గురించి ఒక పాట ఉంది. పిల్లలు చాలా మధురముగా తయారవ్వాలి. ఎప్పుడూ కోపంగా మాట్లాడకూడదు. తండ్రిపై ఎప్పుడూ అలగకూడదు. అలిగి, ఒకవేళ చదువును వదిలారంటే తమ కాళ్ళను తామే గొడ్డలితో నరుక్కున్నట్లు. ఇక్కడ మీరు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు వచ్చారు. మహారాజు అని శ్రీ నారాయణుడిని, మహారాణి అని శ్రీలక్ష్మిని అంటారు. ఇకపోతే శ్రీ శ్రీ అనేది శివబాబా యొక్క టైటిల్. శ్రీ అని దేవతలను అంటారు. శ్రీ అనగా శ్రేష్ఠము.

ఇప్పుడు మీరు ఆలోచించండి - మనం ఎలా ఉండేవారము, మాయ మన తలను తిప్పి మనల్ని ఎలా తయారుచేసింది. భారత్ ఎంత షావుకారుగా ఉండేది. తర్వాత నిరుపేదగా ఎలా అయ్యింది? ఏం జరిగింది? అసలేమీ అర్థం చేసుకోరు. మనమే దేవతలుగా ఉండేవారమని, తర్వాత క్షత్రియులుగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మయే పరమాత్మ అని వారు అంటారు. లేదంటే వాస్తవానికి ‘హమ్ సో’ యొక్క అర్థం ఎంత సహజమైనది. మనిషి జన్మ ఒక్కటే ఉంటుందని వారు అంటారు. కానీ తండ్రి అర్థం చేయిస్తున్నారు - మనుష్యులకు 84 జన్మలు ఉంటాయి. ఆ 84 జన్మలలో, సంగమయుగములోని ఈ ఒక్క జన్మ అతి విలువైనది. ఈ జన్మలో మీరు అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. మీరు చాలా రాయల్ తండ్రికి పిల్లలు, కనుక మీలో ఎంత రాయల్టీ ఉండాలి. రాయల్ మనుష్యులు ఎప్పుడూ గట్టిగా మాట్లాడరు. ప్రపంచములో ఇంటింటిలో ఎంత హంగామా జరుగుతుంది. స్వర్గములో ఇలాంటి విషయాలేవీ ఉండవు. ఈ బాబా కూడా వల్లభాచారి కులానికి చెందినవారిగా ఉండేవారు. అయినా కూడా - ఆ సత్యయుగ దేవతలెక్కడ, నేటి వైష్ణవులు ఎక్కడ! అలాగని వారు వైష్ణవులు కనుక వికారాలలోకి వెళ్ళరని కాదు. రావణ రాజ్యములో అందరూ వికారాలతోనే జన్మిస్తారు. సత్యయుగములో అందరూ సంపూర్ణ నిర్వికారులు. ఇప్పుడు మీరు సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నారు మరియు యోగబలం ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ నడవడిక చాలా మధురముగా, రాయల్ గా ఉండాలి. మీరు ఎవ్వరితోనూ వాదించకూడదు, శాస్త్రవాదము చేయకూడదు. ఎప్పుడైనా వారు శాస్త్రాల గురించి వాదించేందుకు కూర్చున్నప్పుడు, పరస్పరం ఒకరినొకరు కర్రలతో కూడా కొట్టుకుంటారు. పాపం వారి దోషమేమీ లేదు. వారికి ఈ జ్ఞానము గురించి తెలియనే తెలియదు. ఇది ఆత్మిక జ్ఞానము. ఇది ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది. వారు జ్ఞానసాగరుడు. వారికి శారీరక పేరు లేదు, వారు అవ్యక్తమూర్తి. వారు అంటారు - నా పేరు శివ, నేను స్థూల శరీరాన్ని గాని, సూక్ష్మ శరీరాన్ని గాని తీసుకోను. జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అని నన్నే అంటారు. శాస్త్రాలలో ఏమేమి రాసేశారు. హనుమంతుడు పవనపుత్రుడు అని అంటారు, అంటే గాలి నుండి పిల్లలు ఎలా జన్మిస్తారు! తర్వాత పరమాత్మ గురించి మత్స్యావతారము, కూర్మావతారము అని అన్నారు, ఎంతగా నిందించారు. బాబా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు - మీరు ఆసురీ మతముపై నన్ను ఇంతగా నిందించారు, 24 అవతారాలతో కడుపు నిండలేదా, మళ్ళీ కణ-కణములో, రాయి-రప్పలలో నన్ను పడేశారు. ఈ శాస్త్రాలన్నీ ద్వాపరము నుండి తయారయ్యాయి. మొట్టమొదట కేవలం శివునికి మాత్రమే పూజ జరిగేది. గీతను కూడా తర్వాత తయారుచేసారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇదంతా అనాది ఆట. ఇప్పుడు నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చాను. కనుక తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. లక్షణాలు కూడా చాలా బాగా ఉండాలి. కలియుగ అంతిమములో ఏముంది, తర్వాత సత్యయుగములో ఏం చూస్తారు అనేది కూడా అద్భుతము కదా. కలియుగములో భారత్ దీవాలా తీసినట్లు ఉంది, సత్యయుగములో భారత్ సంపన్నముగా ఉంటుంది. ఆ సమయములో వేరే ఖండాలేవీ ఉండవు. ఈ గీతా అధ్యాయము రిపీట్ అవుతూ ఉంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనం రాయల్ తండ్రి పిల్లలము కనుక మన నడవడికను చాలా రాయల్ గా ఉంచుకోవాలి. గట్టిగా మాట్లాడకూడదు. చాలా మధురముగా అవ్వాలి.

2. ఎప్పుడూ కూడా తండ్రిపై గాని, పరస్పరములో గాని అలగకూడదు. అలిగి చదువును ఎప్పుడూ వదలకూడదు. చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, వాటిని వదిలేయాలి.

వరదానము:- ఫుల్ స్టాప్ ద్వారా శ్రేష్ఠ స్థితి రూపీ మెడల్ ను ప్రాప్తి చేసుకునే మహావీర్ భవ
ఈ అనాది డ్రామాలో ఆత్మిక సైన్యము యొక్క సేనాధిపతులకు ఏ మెడల్ నూ ఇవ్వరు కానీ డ్రామానుసారముగా వారికి శ్రేష్ఠ స్థితి రూపీ మెడల్ స్వతహాగా ప్రాప్తిస్తుంది. ఎవరైతే ప్రతి ఆత్మ యొక్క పాత్రను సాక్షీగా చూస్తూ సహజముగా ఫుల్ స్టాప్ చిహ్నాన్ని పెడతారో, వారికే ఈ మెడల్ ప్రాప్తిస్తుంది. ఇటువంటి ఆత్మల పునాది అనుభవం ఆధారముగా ఉంటుంది, అందుకే ఎటువంటి సమస్య అనే గోడ వారిని ఆపు చేయలేదు.
స్లోగన్:- ప్రతి పరిస్థితి అనే పర్వతాన్ని దాటి తమ గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే ఎగిరే పక్షిగా అవ్వండి.

 

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

ఇతరులు చెప్పే విషయాలను స్వీకరించటము మరియు గౌరవించటము, ఎప్పుడైతే ఈ రెండు విషయాలు వస్తాయో అప్పుడిక సంపూర్ణత మరియు సఫలత, రెండూ సమీపముగా వస్తాయి ఎందుకంటే ఇతరులకు గౌరవాన్ని ఇవ్వటమే భవిష్య అధికారాన్ని తీసుకోవటము.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.