తెలుగు మురళి · Brahma Kumaris

ఈరోజు మురళి · 17 నవంబర్, 2026

ఓం శాంతి · BapDada · 17 నవంబర్, 2026

ఈరోజు మురళి — ప్రతి ఉదయం కొత్తది.

18
డౌన్‌లోడ్ PDF
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

17-11-2026
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - నేను పిల్లలైన మీ కోసం అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చాను, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది’’
ప్రశ్న:- అనంతమైన సంతోషము ఏ పిల్లలకు నిరంతరం ఉండగలదు?
జవాబు:- ఎవరైతే అనంతమైన సన్యాసము చేశారో, ఇతర సాంగత్యాలను వదలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించారో, వారే నిరంతరం సంతోషముగా ఉండగలరు. 2. ఎవరైతే ఫాలో ఫాదర్ చేస్తారో, ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారి సంతోషము ఎప్పుడు మాయమవ్వదు.
పాట:- ఆకాశ సింహాసనాన్ని వదిలి రా...

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఇలా ఎవరు అన్నారు? పాట విన్నారా అని తండ్రి పిల్లలను అడిగారు. ఎప్పుడైతే అతి దుఃఖము ఉంటుందో అప్పుడు పిలుస్తారు. తండ్రియే సుఖధామాన్ని లేక పావన ప్రపంచాన్ని రచిస్తారని అనగా భగవాన్, భగవతీల రాజ్యాన్ని స్థాపన చేస్తారని పిల్లలకు తెలుసు. భగవాన్ మరియు భగవతి స్వర్గానికి యజమానుల వంటివారు. లక్ష్మీ-నారాయణులు ఎంతటి ధనవంతులుగా ఉండేవారు, ఎంత పెద్ద రాజధాని ఉండేది అనేది మీరు చూస్తారు. వారి రాజధానిలో ఎప్పుడూ ఉపద్రవాలేవీ సంభవించవు. తండ్రి పిల్లలకు అటువంటి వారసత్వాన్ని ఇస్తున్నారంటే ఎంత సంతోషముగా ఉండాలి. కానీ నంబరువారు పురుషార్థానుసారముగా అయితే ఉన్నారు. కొంతమందైతే పూర్తి జ్ఞానాన్ని తీసుకోని కారణముగా అక్కడ కూడా సంతోషముగా ఉండరు, ఇక్కడ కూడా సంతోషముగా ఉండరు. అటువంటివారిని రెండు ప్రపంచాలకు చెందనివారు అని అంటారు ఎందుకంటే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటూ-తీసుకుంటూ పడిపోతారు. భగవంతుడు వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారని ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే వారు రావడమే గుప్త రూపములో వస్తారు. తప్పకుండా భగవంతుడు ఈ సమయములో ఉండాలని అంటారు ఎందుకంటే అందరూ ఘోర అంధకారములో ఉన్నారు. రాత్రి 12 గంటలైతే దానిని ఘోర అంధకారమని అంటారు. రాత్రి ఘోర అంధకారము ఉంటుంది, పగలు అత్యంత ప్రకాశము ఉంటుంది. ఇప్పుడు భక్తి మార్గము యొక్క రాత్రి పూర్తవుతుందని, అందులో దుఃఖమే దుఃఖముందని పిల్లలకు తెలుసు. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తారని మనుష్యులు భావిస్తారు. తండ్రియే వచ్చి మనందరికీ సద్గతినిస్తారని మీకు తెలుసు. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా తప్పకుండా ఉన్నారు. కొందరికైతే సంతోషమనే పాదరసం పైకి ఎక్కి ఉంటుంది. కృషిని కూడా సంతోషముగా చేస్తారు. ఎవరికైనా వెళ్ళి అర్థం చేయించాలి అని సేవ పట్ల అభిరుచి ఉంటుంది, అందుకే బాబా ప్రదర్శనీలను, మేళాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇతరులకు అర్థం చేయిస్తే సంతోషమనే పాదరసం పైకి ఎక్కుతుంది. ఇక్కడ ఎవరి వద్దనైతే ధనముంటుందో, వారు మేము స్వర్గములో కూర్చున్నామని భావిస్తారు. వారికి జ్ఞానము తీసుకోవడం కష్టమనిపిస్తుంది, అందుకే, కోటిలో ఏ ఒక్కరో మాత్రమే అంతటి వివేకవంతులుగా అయి తండ్రి వారసత్వానికి అధికారులుగా అవుతారు అని అంటారు. ఫాలో ఫాదర్ అని అంటూ ఉంటారు. కనుక తండ్రి శ్రీమతముపై నడవాల్సి ఉంటుంది. ఎవరైతే మంచి రీతిలో శ్రీమతముపై నడుస్తారో వారు తండ్రిని ఫాలో చేయాలి. ఉదాహరణకు ఈ బిడ్డ (బ్రహ్మా) బాగా నడుచుకుంటున్నారు. లౌకిక పిల్లలు ఇతని సలహాను పాటించనప్పుడు, మీ దారి మీరు చూసుకోండి అని అన్నారు. రావణుడి మతముపై నడిచేవారు మరియు రాముడి మతముపై నడిచేవారు కలిసి ఉండలేరు.

భారత్ లోనే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేదని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వారు 84 జన్మలు తీసుకుని పతితముగా అయ్యారు, అందుకే - ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. దైవీ రాజధానిని స్థాపన చేయడములో సమయమైతే పడుతుంది. ఇది గుప్తమైనది. ఇందులో యుద్ధమనే మాటే లేదు. అలాగని దాడి చేసి రాజ్యము తీసుకుంటారని కాదు, అలా కాదు. ఇక్కడ తండ్రి వచ్చి రాజులకే రాజులుగా తయారుచేస్తారు, ఆ తండ్రిని దుఃఖహర్త, సుఖకర్త రండి అని తలచుకుంటారు. సన్యాసులు, గురువులు దుఃఖహర్తలుగా అవ్వలేరు. వారిది హద్దు సన్యాసము, మీది అనంతమైన సన్యాసము. ఇందులో అనంతమైన సంతోషముంటుంది. భగవతీ, భగవాన్ అయిన ఈ లక్ష్మీ-నారాయణులకు కూడా అనంతమైన సంతోషముంటుంది కదా. పతిత మనుష్యులకు ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు. మీరైతే ఒక్కొక్క పదాన్ని అర్థ సహితముగా మాట్లాడుతారు. కొత్త ప్రపంచములో ఉన్నదే ఒక్క ధర్మము. ఆ ప్రపంచాన్ని దేనితోనూ పోల్చడం జరగదు. పాత ప్రపంచములో పోల్చడం జరుగుతుంది. పాత ప్రపంచములో ఏముంటుంది అనేది కొత్త ప్రపంచములో తెలియదు. అక్కడ అంతా మర్చిపోతారు. ఇక్కడ - కొత్త ప్రపంచము ఎప్పుడు స్థాపన అవుతుంది, పాత ప్రపంచము ఎప్పుడు వినాశనమవుతుంది అని మీకు అంతా చెప్పడం జరుగుతుంది. మీలో పూర్తి జ్ఞానము ఉంది. ఇప్పుడు మీకు స్వర్గ స్థాపన చేసే తండ్రి లభించారు కనుక వారి నుండి మంచి రీతిలో వారసత్వాన్ని తీసుకోవాలి. ఎవరైతే కల్పక్రితం బాగా పురుషార్థము చేశారో, వారసత్వము కూడా వారికే లభిస్తుంది. వారిలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఇది ముళ్ళ ప్రపంచము. మొదటి నంబరు ముల్లు అయితే అందరిలోనూ ఉంది. పాత ప్రపంచము ఛీ-ఛీగా, కొత్త ప్రపంచము మంచిగా ఉంటుంది. స్వర్గమని దేనినంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని ఊరికే అలా అంటూ ఉంటారు. స్వర్గస్థులవ్వడానికి అసలు స్వర్గము ఎక్కడుంది.

స్వర్గము కూడా ఈ భారత్ లోనే ఉండేదని మీకు తెలుసు. నరకము కూడా భారత్ లోనే ఉంది. మనుష్యులు ఈ పదాలను పట్టుకుని స్వర్గము-నరకము ఇక్కడే ఉన్నాయని అంటారు. ఎవరి వద్దనైతే చాలా ధనముంటుందో వారు స్వర్గములో ఉన్నారని భావిస్తారు, కానీ అలా కాదు. భారత్ కొత్తగా ఉన్నప్పుడు సత్యయుగము ఉండేది, దానిని స్వర్గమని అంటారు. ఇప్పుడిది పతిత ప్రపంచము, నరకము. ప్రపంచమైతే ఒక్కటే. కొత్త ప్రపంచములో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. పాత ప్రపంచములో రావణుడి రాజ్యముంది. భగవానువాచ - నేను మీకు 84 జన్మల రహస్యాన్ని తెలియజేస్తాను. ఈ రాజయోగముతో మిమ్మల్ని రాజులకే రాజులుగా, స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. కనుక నరకము తప్పకుండా వినాశనమవ్వాలి. శాస్త్రాలలో శ్రీకృష్ణుని పేరు వ్రాసి యుద్ధము మొదలైనవి చూపించారు. పాండవులకు సైన్యమంటూ ఏదీ లేదు. ఈ రోజుల్లో కన్యలు మరియు మాతల యొక్క సైన్యాన్ని తయారుచేసి వారికి తుపాకులు మొదలైనవి ఉపయోగించడం నేర్పిస్తారు. ఇక్కడ మీ చేతిలో తుపాకులు మొదలైనవేవీ లేవు. శివశక్తి సైన్యము అంటే ఎవరు అనేది వారికేమి తెలుసు. శివబాబా అయితే ఎప్పుడూ హింసను చేయించలేరు. యుద్ధమన్న మాటే లేదు. ఇది శివబాబా యొక్క ఆత్మిక సైన్యము అని మీకు తెలుసు. శివబాబా మనల్ని డబల్ అహింసకులుగా తయారుచేస్తారు. దీనినే 100 శాతం అహింస అని అంటారు. ఈ ప్రపంచములో 100 శాతం హింస ఉంది. ఒక్క బాంబుతోనే ఎంతమందిని వినాశనము చేస్తారు. అనంతమైన అహింసకు మరియు హింసకు ఎంత తేడా ఉంది. మీరు ఇప్పుడు ఈ సమయములో అనంతమైన సైలెన్స్ లో ఉన్నారు. అటువైపు ఎంతగా యుద్ధానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయో, అంతగా శబ్దము పెరుగుతూ ఉంటుంది. వినాశన సమయములో ఎంత హంగామా జరుగుతుంది. స్థాపనలోనైతే మీరు ఎంత సైలెన్స్ లో కూర్చుని ఉన్నారు. హింస యొక్క విషయమేమీ లేదు. మీది ఇప్పుడు ప్రాక్టికల్ జీవితము. తండ్రి నుండి యోగబలం ద్వారా వారసత్వాన్ని పొందుతున్నారు. తండ్రి అయిన భగవంతుడిని స్మృతి చేసినట్లయితే స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది, ఇది ఎంత సహజము. తండ్రి ఎంతటి అత్యంత ప్రియమైనవారు, ఎంతటి దూరదేశం నుండి వస్తారు. ఉదాహరణకు విదేశాల నుండి ఎవరి తండ్రి అయినా వచ్చినప్పుడు పిల్లలు చాలా సంతోషపడతారు. మా తండ్రి మా కోసం విదేశాల నుండి మంచి-మంచి కానుకలు తీసుకువస్తారని భావిస్తారు. ఈ అనంతమైన తండ్రి అయితే ఒక్కసారి మాత్రమే వస్తారు. ఏ కానుకను తీసుకువస్తారు? వారంటారు - నేను మీ కోసం అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చాను. హనుమంతుడు సంజీవని మూలిక యొక్క పర్వతాన్ని తీసుకువచ్చారని అంటారు కదా. కానీ పర్వతాన్ని అయితే ఎవ్వరూ ఎత్తలేరు. అదే విధముగా తండ్రి అంటారు - నేను అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చాను. ఇప్పుడు స్వర్గాన్ని ఎవ్వరూ అరచేతిలో తీసుకురాలేరు. ఇది అర్థం చేసుకునే విషయము. బాబా మన కోసం నంబరువన్ కానుకను తీసుకువచ్చారని పిల్లలకైతే తెలుసు. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని పావన ప్రపంచానికి యజమానులుగా తయారుచేయడానికి వచ్చాను కనుక పావనముగా అవ్వాల్సి ఉంటుంది. ఇది రాజయోగము కదా. భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని గీతా భగవానుడే నేర్పించారు మరియు రాజ్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మేము స్వర్గ స్థాపన చేసే తండ్రికి పిల్లలము అని మీరంటారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కనుక తప్పకుండా ఎవరో ఒకరికి రాజ్యాధికారము లభించే ఉంటుంది కదా. అలాగని, కేవలం స్వర్గములో ఉండేవారికి మాత్రమే తండ్రి ఇచ్చి ఉంటారని కాదు. మిగిలిన వారందరికీ కూడా తండ్రి ఇస్తారు కదా. మిగిలినవారందరికీ డ్రామానుసారముగా ముక్తి యొక్క పాత్ర లభించి ఉంది. అందరూ విముక్తులుగా అయిపోతారు. ఒక్క తండ్రి మాత్రమే సర్వుల సద్గతిదాత, ఇంకెవ్వరూ కారు. ప్రదర్శనీలలో మీ వద్దకు ప్రసిద్ధమైనవారు ఎవరైతే వస్తారో, అందులో ఎవరైతే - నిజంగా గీతా భాగవానుడు శ్రీకృష్ణుడు కాదు, శివుడు అని నమ్ముతారో, అటువంటివారి చేత వ్రాయించాలి. పెద్ద వ్యక్తుల మాటనే వింటారు. పేదవారి మాటను ఎవ్వరూ వినరు. అందుకే ప్రదర్శనీలలో ప్రయత్నించి - గీతా భగవానుడు ఒక్కరే, వారే అందరికీ తండ్రి అని వ్రాయించండి. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది, లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. ఇప్పుడైతే మొత్తం విశ్వముపై రావణుడి రాజ్యముంది. ఇతడే అందరికీ శత్రువు, ఇతడినే ప్రతి సంవత్సరము కాలుస్తారు, అయినా మరణించడు. ఇప్పుడు భారత్ కు పెద్ద శత్రువు ఈ రావణుడే. ఈ విషయము కేవలం మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు రాముడైన పరమపిత పరమాత్మ రావణుడిపై విజయము ప్రాప్తింపజేస్తారు. వారంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నాశనమవుతాయి, మీరు యోగ్యులుగా అయిపోతారు, అప్పుడిక కొత్త ప్రపంచము కావాలి. ఇంతకుముందు తప్పకుండా పాత ప్రపంచ వినాశనము కూడా జరిగింది, అది మళ్ళీ జరుగుతుంది. ఎప్పుడైతే రావణ రాజ్యము వినాశనమై రామ రాజ్యము స్థాపన అవుతుందో, అప్పుడే మహాభారత యుద్ధము జరిగింది. రావణ రాజ్యములోనే హాహాకారాలు మొదలవుతాయి. హాహాకారాల తర్వాత జయజయకారాలు జరుగుతాయి, ప్రపంచము పరివర్తనవుతుంది. ఎలాగైతే పాత ఇంటిని పడగొట్టి కొత్తదానిని నిర్మించి, ఆ తర్వాత అది పాతదయ్యాక దానిని కూడా పడగొడతారో, స్థాపన కూడా అలాగే జరుగుతుంది. బాంబులు మొదలైనవి తయారుచేస్తూనే ఉంటారు. ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దసరా వచ్చినప్పుడు రావణుడి దిష్టిబొమ్మను కూడా తయారుచేసారు. మీది అనంతమైన విషయము. వారు ఏమి చేస్తున్నారు అనేది మీ బుద్ధిలోకి వస్తుంది. మీరు అర్థం చేయించినప్పుడు, వారు ఏం చేస్తున్నారు అనేది వారికి అర్థమవుతుంది. నవ్వు కూడా వస్తుంది. ఇంత పెద్ద రావణుడైతే ఉండడని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఇప్పుడు తండ్రి అంటారు - మీరు రామ రాజ్యాన్ని తీసుకోండి. 5 వికారాలను దానమిస్తే గ్రహణము వదిలిపోతుంది. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు, ఈ 5 వికారాల గ్రహణము మొత్తం ప్రపంచమంతటికీ పట్టి ఉంది. పూర్తిగా నల్లగా అయిపోతారు. పిల్లలైన మీకైతే అపారమైన సంతోషముండాలి. ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి.

మీకు ఇప్పుడు క్రియేటర్, డైరెక్టర్, ముఖ్యమైన యాక్టర్స్ గురించి, డ్రామా ఆదిమధ్యాంతాల గురించి తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మీ బుద్ధి ఇప్పుడు స్వచ్ఛ బుద్ధిగా అయ్యింది. మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక తప్పకుండా స్వర్గములోకి పంపిస్తారు. జ్ఞానము సంపాదనకు ఆధారము అని అంటారు. ఇది ఆత్మిక జ్ఞానము, దీనిని తండ్రి మాత్రమే ఇస్తారు. దీనిని మనుష్యులు, మనుష్యులకు ఇవ్వలేరు. ప్రపంచములో అంతా, మనుష్యులు, మనుష్యులకు జ్ఞానాన్ని ఇస్తారు. మీకైతే తండ్రి అయిన పరమ ఆత్మ వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. మిగిలినవారంతా భక్తి మార్గములోని కల్పిత కథలను వినిపించేవారు. సత్యనారాయణ కథ, రామాయణ కథ... ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి గురించి ఏవో ఒక కథలను తయారుచేస్తూ ఉంటారు. ఇది చదువు. చదువులో చరిత్ర-భౌగోళికాలను వినిపించడం జరుగుతుంది. ఇది ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికము, ఇది చాలా పెద్దది. బాబా 5 వేల సంవత్సరాల క్రితం కూడా చెప్పారని మీరు అర్థం చేయిస్తారు. ఆ గీతను చదివేవారు ఏమీ అర్థం చేసుకోరు. యాదవులు, కౌరవులు, పాండవులు అని ఎవరినంటారో మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. యూరోప్ వాసులైన యాదవులు మిసైల్స్ ను తయారుచేసారు, వాటి ద్వారా వినాశనము జరిగింది. కానీ వినాశనము తర్వాత ఏం జరిగింది అనేదేమీ చూపించరు. ప్రళయము జరిగిందని వారు భావిస్తారు. మీరు శాస్త్రాలను నమ్ముతారా అని వారు అడుగుతారు. అప్పుడు వారికి చెప్పండి - అవును, మాకు శాస్త్రాల గురించి తెలుసు, మేము నమ్ముతాము, అవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. జ్ఞానమైతే ఒక్క తండ్రి మాత్రమే వినిపిస్తారు, వారే జ్ఞానసాగరుడు. ఇప్పుడు భక్తి సమాప్తమై జ్ఞానము జిందాబాద్ అవుతూ ఉంది. పాత ప్రపంచ వినాశనము ఎదురుగా నిలబడి ఉంది, కొత్తేమీ కాదు. మనకు తండ్రి పట్ల ప్రీతి ఉంది. మనం ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితో సాంగత్యాన్ని జోడిస్తాము. తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నాతో యోగము జోడించండి, దీనినే భారత్ యొక్క ప్రాచీన యోగమని అంటారు, దీనిని తండ్రి మాత్రమే నేర్పిస్తారు. శ్రీకృష్ణుని ఆత్మ కూడా ఈ సమయములో అంతిమ జన్మలో ఉంది. తండ్రి వీరితో అంటారు - మీకు మీ జన్మల గురించి తెలియదు, ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. అందుకే నేను వీరిలో ప్రవేశించాను. నేను వీరిలో కూర్చుని పిల్లలైన మిమ్మల్ని బ్రహ్మా ముఖవంశావళిగా చేసి రాజ్య భాగ్యాన్ని ఇస్తాను. తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇలా చెప్పలేరు. ఇక్కడ స్వయంగా తండ్రి ఈ నోటి ద్వారా వినిపిస్తున్నారు. ఈ బాబాకు కూడా ఒకప్పుడు ఏమీ తెలియదు, మీకు కూడా ఏమీ తెలియదు. 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుంది అనేది భారతవాసులకే అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే యుద్ధము నిలబడి ఉంది, దాని ద్వారా స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ సమయములోనే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించి మనుష్యులను దేవతలుగా తయారుచేసారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరైతే మంచి రీతిలో శ్రీమతముపై నడుస్తారో, వారిని ఫాలో చేయాలి. అనంతమైన సంతోషములో ఉండేందుకు తమ సమానముగా తయారుచేసే సేవను చేయాలి.

2. ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యి ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క తండ్రితో జోడించాలి. డబల్ అహింసకులుగా అయి సైలెన్స్ లో కూర్చుని తమ రాజ్యాన్ని స్థాపన చేసుకోవాలి.

వరదానము:- త్యాగము మరియు తపస్య ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాధారి భవ
సేవలో సఫలతకు ముఖ్యమైన సాధనము త్యాగము మరియు తపస్య. త్యాగము అనగా మనసా సంకల్పాల ద్వారా కూడా త్యాగము. ఏదైనా పరిస్థితి కారణముగా, మర్యాదల కారణముగా, తప్పదన్నట్లుగా త్యాగము చేయడమనేది త్యాగము కాదు, కానీ జ్ఞాన స్వరూపముతో సంకల్పములో కూడా త్యాగిగా అవ్వండి. తపస్వీ అనగా సదా తండ్రి ప్రేమలో లవలీనులై, జ్ఞానము, ప్రేమ, ఆనందము, సుఖము మరియు శాంతి సాగరములో ఇమిడి ఉండటము. ఇటువంటి త్యాగీలు మరియు తపస్వీలే సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాధారులు.
స్లోగన్:- మీ తపస్య ద్వారా శాంతి వైబ్రేషన్లను వ్యాపింపజేయడమే విశ్వ సేవాధారులుగా అవ్వడము.

 

అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి

సంపూర్ణ ఆత్మలైన మీ అంతిమ వాహనము - కర్మబంధన ముక్త, కర్మాతీత స్థితి. ఇటువంటి స్థితిని తయారుచేసుకునేందుకు బ్రహ్మాబాబా సమానముగా సర్వ హద్దులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే విజయీ రత్నాలుగా అవ్వండి, అప్పుడు అంతిమ కర్మాతీత స్వరూపము యొక్క అనుభవీలుగా అవుతారు. అనేక రకాల హద్దులు అనగా అనేక రకాల నావి, నావి అనేవి. నేను మరియు నాది, నీవు మరియు నీది, ఎప్పుడైతే ఈ నాలుగు పదాలు ఒక్క ‘బాబా’ అనే పదములో ఇమిడిపోతాయో, అప్పుడు సంపూర్ణత సమీపముగా వస్తుంది.

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.