| 16-10-2024 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - మీరు అపారమైన సుఖాన్ని పొందేందుకు మాత, పితల సమ్ముఖములోకి వచ్చారు, తండ్రి మిమ్మల్ని అపారమైన దుఃఖాల నుండి బయటకు తీసి అపారమైన సుఖాలలోకి తీసుకువెళ్తారు’’ | |
| ప్రశ్న:- | ఒక్క తండ్రే రిజర్వులో ఉంటారు, పునర్జన్మలు తీసుకోరు - ఎందుకు? |
| జవాబు:- | ఎందుకంటే మిమ్మల్ని తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా తయారుచేసేవారు ఎవరో ఒకరు కావాలి. ఒకవేళ తండ్రి కూడా పునర్జన్మలలోకి వస్తే, మరి నల్లగా ఉన్న మిమ్మల్ని తెల్లగా ఎవరు తయారుచేస్తారు, అందుకే తండ్రి రిజర్వులో ఉంటారు. |
| ప్రశ్న:- | దేవతలు సదా సుఖముగా ఎందుకు ఉంటారు? |
| జవాబు:- | ఎందుకంటే వారు పవిత్రముగా ఉంటారు, పవిత్రత కారణముగా వారి నడవడిక తీర్చిదిద్దబడి ఉంది. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖ-శాంతులు ఉంటాయి. ముఖ్యమైనది పవిత్రత. |
ఓం శాంతి. మధురాతి మధురమైన చాలాకాలం తర్వాత కలిసిన పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు. వారు తండ్రి కూడా, మాత-పిత కూడా. నీవే తల్లివి, తండ్రివి, మేము నీ పిల్లలము... అని మీరు గానం చేసేవారు కదా. ఇలా అందరూ పిలుస్తూ ఉంటారు. ఎవరిని పిలుస్తారు? పరమపిత పరమాత్మను. అలా పిలుస్తూ ఉంటారు కానీ వారి కృపతో ఎటువంటి సుఖము లభిస్తుంది మరియు అది ఎప్పుడు లభిస్తుంది అనేది వారికి అర్థం కాదు. అపారమైన సుఖము అని దేనినంటారో కూడా వారికి అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎదురుగా కూర్చున్నారు, ఇక్కడ ఎంతటి అపారమైన దుఃఖాము ఉందో మీకు తెలుసు. ఇది దుఃఖధామము. అది సుఖధామము. మనం 21 జన్మలు స్వర్గములో చాలా సుఖముగా ఉంటాము అన్నది ఎవరి బుద్ధిలోకీ రాదు. మీకు కూడా ఇంతకుముందు ఈ అనుభవం లేదు. మేము ఆ పరమపిత పరమాత్మ, ఆ మాత-పిత ఎదురుగా కూర్చున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనం 21 జన్మల కొరకు స్వర్గ రాజ్యాధికారాన్ని ప్రాప్తించుకునేందుకే ఇక్కడకు వస్తాము అని మీకు తెలుసు. తండ్రిని కూడా తెలుసుకున్నారు మరియు తండ్రి ద్వారా మొత్తం సృష్టి చక్రమంతటినీ కూడా అర్థం చేసుకున్నారు. మనం మొదట అపారమైన సుఖములో ఉండేవారము, ఆ తర్వాత దుఃఖాలలోకి వచ్చాము. ఇది కూడా నంబరువారుగా ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంటుంది. విద్యార్థులకైతే సదా గుర్తుండాలి, కానీ ఘడియ-ఘడియ మర్చిపోతూ ఉన్నారు అన్నది బాబా చూస్తున్నారు. మర్చిపోతున్నారు కావుననే వాడిపోతూ ఉంటారు, ముట్టుకుంటే ముడుచుకుపోయే అవస్థ తయారవుతుంది, మాయ దాడి చేస్తుంది, ఆ సంతోషమేదైతే ఉండాలో అది ఉండదు. పదవులు నంబరువారుగానైతే ఉంటాయి కదా. స్వర్గములో అయితే వెళ్తారు కానీ అక్కడ కూడా రాజు నుండి మొదలుకుని సామాన్యమైన వ్యక్తి వరకూ అందరూ ఉంటారు కదా. కొందరు పేద ప్రజలు ఉంటారు, కొందరు షావుకార్లు ఉంటారు. స్వర్గములో కూడా అలా ఉంటారు, అలాగే నరకములో కూడా అలా ఉంటారు. ఉన్నతులు మరియు తక్కువగా ఉన్నవారు. అపారమైన సుఖాన్ని పొందేందుకు మనం పురుషార్థం చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులకు అందరికన్నా ఎక్కువ సుఖము ఉంది కదా. ముఖ్యమైనది పవిత్రతా విషయము. పవిత్రత లేకుండా శాంతి మరియు సంపన్నత లభించదు. ఇందులో నడవడిక చాలా బాగా ఉండాలి. మనుష్యుల నడవడిక పవిత్రత ద్వారానే తీర్చిదిద్దబడుతుంది. పవిత్రముగా ఉంటే వారిని దేవతలు అని అంటారు. మీరు ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవతలు సదా సుఖముగా ఉండేవారు. మనుష్యులెవ్వరూ సదా సుఖముగా ఉండలేరు. సుఖము దేవతలకే ఉంటుంది. ఈ దేవతలనే మీరు పూజించేవారు కదా ఎందుకంటే వారు పవిత్రముగా ఉండేవారు. మొత్తం ఆధారమంతా పవిత్రత పైనే ఉంది. విఘ్నాలు కూడా ఇందులోనే వస్తాయి. ప్రపంచములో శాంతి ఏర్పడాలని కోరుకుంటారు. బాబా అంటారు, పవిత్రత లేకుండా శాంతి ఎప్పుడూ ఏర్పడదు. మొట్టమొదట ముఖ్యమైనది పవిత్రతా విషయమే. పవిత్రత ద్వారానే తీర్చిదిద్దబడిన నడవడిక ఉంటుంది. పతితులుగా అయినట్లయితే మళ్ళీ నడవడిక పాడవుతుంది. ఇప్పుడు మనము మళ్ళీ దేవతలుగా అవ్వాలంటే పవిత్రత తప్పకుండా కావాలి అని అర్థం చేసుకోవాలి. దేవతలు పవిత్రముగా ఉంటారు, అందుకే అపవిత్రులైన మనుష్యులు వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. ముఖ్యమైన విషయము పవిత్రతదే. పిలవడం కూడా - ఓ పతిత-పావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అనే పిలుస్తారు. తండ్రి అంటారు, కామము మహాశత్రువు, దీనిపై విజయాన్ని పొందండి. దీనిపై విజయాన్ని పొందడం ద్వారానే మీరు పవిత్రముగా అవుతారు. మీరు పవిత్రముగా, సతోప్రధానముగా ఉన్నప్పుడు శాంతి ఉండేది, సుఖము కూడా ఉండేది. పిల్లలైన మీకు ఇప్పుడు ఇది గుర్తుకువచ్చింది, ఇది నిన్నటి విషయమే. మీరు పవిత్రముగా ఉన్నప్పుడు అపారమైన సుఖ-శాంతులు మొదలైనవన్నీ ఉండేవి. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ లక్ష్మీ-నారాయణుల వలె అవ్వాలి, ఇందులో మొదటి ముఖ్యమైన విషయము - సంపూర్ణ నిర్వికారులుగా అవ్వడము. ఈ గాయనము ఉంది. ఇది జ్ఞాన యజ్ఞము. ఇందులో విఘ్నాలైతే తప్పకుండా వస్తాయి. పవిత్రతా విషయములో ఎంతగా విసిగిస్తారు. ఆసురీ సాంప్రదాయము మరియు దైవీ సాంప్రదాయము అని కూడా అంటూ ఉంటారు. సత్యయుగములో ఈ దేవతలు ఉండేవారని మీ బుద్ధిలో ఉంది. ముఖము మనుష్యుల వలె ఉన్నా కానీ వారిని దేవతలు అనే అంటారు. అక్కడ సంపూర్ణ సతోప్రధానులుగా ఉంటారు. అక్కడ ఎటువంటి లోపమూ ఉండదు. ప్రతి వస్తువూ పర్ఫెక్ట్ గా ఉంటుంది. తండ్రి పర్ఫెక్ట్ గా ఉంటారు కావున పిల్లలను కూడా పర్ఫెక్ట్ గా తయారుచేస్తారు. యోగబలముతో మీరు ఎంత పవిత్రముగా మరియు సుందరముగా తయారవుతారు. ఈ యాత్రికుడైతే సదా సుందరముగానే ఉంటారు, వారు నల్లగా ఉన్న మిమ్మల్ని తెల్లగా తయారుచేస్తారు. అక్కడ సహజసిద్ధమైన సౌందర్యము ఉంటుంది. సుందురముగా తయారుచేయవలసిన అవసరం ఉండదు. సతోప్రధానులు సుందరముగానే ఉంటారు. వారే మళ్ళీ తమోప్రధానముగా అవ్వడముతో నల్లగా అయిపోతారు. పేరే శ్యామ్ మరియు సుందరుడు అని ఉంది. శ్రీకృష్ణుడిని శ్యామ్ మరియు సుందరుడు అని ఎందుకు అంటారు? దీని అర్థాన్ని తండ్రి తప్ప ఇంకెవరూ ఎప్పుడూ చెప్పలేరు. భగవంతుడైన తండ్రి ఏ విషయాలనైతే వినిపిస్తారో వాటిని ఇతర మనుష్యులెవరూ వినిపించలేరు. చిత్రాల్లో స్వదర్శన చక్రాన్ని దేవతలకు చూపించారు.
తండ్రి అర్థం చేయిస్తారు - మధురాతి మధురమైన పిల్లలూ, దేవతలకైతే స్వదర్శన చక్రము అవసరం లేదు. వారు శంఖము మొదలైనవాటిని ఏమి చేసుకుంటారు. స్వదర్శన చక్రధారులు బ్రాహ్మణ పిల్లలైన మీరే. శంఖధ్వనిని కూడా మీరే చేయాలి. ఇప్పుడు విశ్వములో శాంతి స్థాపన ఏ విధంగా జరుగుతుందో మీకు తెలుసు. దానితోపాటు నడవడిక కూడా బాగుండాలి. భక్తి మార్గములో కూడా మీరు దేవతల ముందుకు వెళ్ళి మీ నడవడికను వర్ణన చేసుకుంటారు కదా. కానీ దేవతలేమీ మీ నడవడికను తీర్చిదిద్దరు. తీర్చిదిద్దేవారు వేరొకరు ఉన్నారు. ఆ శివబాబా నిరాకారుడు. వారి ఎదురుగా - మీరు సర్వగుణ సంపన్నులు అని అనరు. శివుని మహిమయే వేరు. దేవతల మహిమను గానం చేస్తారు. కానీ మనం ఆ విధంగా ఎలా అవ్వాలి. ఆత్మయే పవిత్రముగా మరియు అపవిత్రముగా అవుతుంది కదా. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రముగా అవుతోంది. ఆత్మ సంపూర్ణముగా అయిపోతే ఇక ఈ పతిత శరీరము ఉండదు, వారు వెళ్ళి పావన శరీరాన్ని తీసుకుంటారు. ఇక్కడైతే పావన శరీరము ఉండదు. ఎప్పుడైతే ప్రకృతి కూడా సతోప్రధానముగా ఉంటుందో, అప్పుడే పావన శరీరము ఉంటుంది. కొత్త ప్రపంచములో ప్రతి వస్తువూ సతోప్రధానముగా ఉంటుంది. ఇప్పుడు పంచ తత్వాలూ తమోప్రధానముగా ఉన్నాయి, అందుకే ఎన్ని వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. మనుష్యులు ఎలా మరణిస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు, ఏదైనా ప్రమాదము జరిగితే మరణిస్తారు. నీరు, భూమి మొదలైనవి ఎంతగా నష్టపరుస్తాయి. ఈ తత్వాలన్నీ మీకు సహాయం చేస్తాయి. వినాశనములో అకస్మాత్తుగా వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి - ఇవి ప్రకృతి వైపరీత్యాలు. ఆ బాంబులు మొదలైనవాటినేవైతే తయారుచేస్తారో అవి కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. వాటిని ఈశ్వరీయ ఆపదలు అని అనరు. అవన్నీ మనుష్యుల చేత తయారుచేయబడినవి. భూకంపాలు మొదలైనవి మనుష్యుల చేత తయారుచేయబడినవి కావు. ఈ ఆపదలు మొదలైనవన్నీ ఒకదానితో ఒకటి కలుస్తాయి, భూమిపై ఉన్న భారము తగ్గుతుంది. బాబా ఏ విధముగా మనల్ని పూర్తిగా తేలికగా చేసి తమతోపాటు కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్తారు అనేది మీకు తెలుసు. తలపై ఉన్న భారము తేలికవ్వడముతో ఇక చురుకుగా అయిపోతారు కదా. మిమ్మల్ని బాబా పూర్తిగా తేలికగా చేసేస్తారు. అన్ని దుఃఖాలూ దూరమైపోతాయి. ఇప్పుడు మీ అందరి తల చాలా భారీగా ఉంది. ఆ తర్వాత అందరూ తేలికగా, శాంతిగా, సుఖముగా అయిపోతారు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారైనా - బాబా అందరి సద్గతిని చేయడానికి వచ్చారు అన్న సంతోషము అందరికీ ఉండాలి. ఎప్పుడైతే పూర్తి స్థాపన జరుగుతుందో, అప్పుడు అన్ని ధర్మాలూ వినాశనమైపోతాయి. ఇంతకుముందు మీ బుద్ధిలో ఈ ఆలోచన కూడా ఉండేది కాదు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బ్రహ్మా ద్వారా స్థాపన అన్న గాయనము కూడా ఉంది. మిగిలిన అనేక ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. ఈ కర్తవ్యాన్ని ఒక్క తండ్రే చేస్తారు, శివబాబా తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఇటువంటి అలౌకికమైన జన్మ మరియు అలౌకికమైన కర్తవ్యము ఇంకెవరికీ ఉండదు. తండ్రి ఉన్నతోన్నతమైనవారు. కావున వారి కర్తవ్యము కూడా చాలా ఉన్నతమైనది. వారు చేసేవారు మరియు చేయించువారు కదా. ఈ సృష్టి నుండి పాపాత్ముల భారాన్ని తొలగించేందుకు తండ్రి వచ్చారు అని మీరు జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి ఏక ధర్మ స్థాపనను మరియు అనేక ధర్మాల వినాశనాన్ని చేయడానికి వస్తారు అన్న గాయనము కూడా ఉంది కదా. మిమ్మల్ని ఇప్పుడు ఎంత ఉన్నతమైన మహాత్ములుగా తయారుచేస్తున్నారు. దేవతలు తప్ప ఇంకెవరూ మహాత్ములు కారు. ఇక్కడైతే అనేకులను మహాత్ములు అని అంటూ ఉంటారు. కానీ మహాత్మ అని మహాన్ ఆత్మను అంటారు. రామ రాజ్యము అని స్వర్గమునే అంటారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కావున వికారాల ప్రసక్తి కూడా ఉత్పన్నమవ్వదు, అందుకే వారిని సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. ఎంతగా సంపూర్ణులుగా అవుతారో, అంతగా ఎంతో సమయము సుఖాన్ని పొందుతారు. అసంపూర్ణులు అయితే ఇంతటి సుఖాన్ని పొందలేరు. స్కూల్లో కూడా కొందరు సంపూర్ణులుగా, కొందరు అసంపూర్ణులుగా ఉంటారు, తేడా కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ అంటే డాక్టరే, కానీ కొందరి జీతము చాలా తక్కువగా ఉంటుంది, కొందరిది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే అందరూ దేవతలుగానే ఉంటారు కానీ పదవులలో ఎంత తేడా వచ్చేస్తుంది. తండ్రి వచ్చి మీ చేత ఉన్నతమైన చదువును చదివిస్తారు. శ్రీకృష్ణుడిని శ్యామసుందరుడు అని అంటారు. నల్లని కృష్ణుడిని కూడా చూపిస్తారు. శ్రీకృష్ణుడు నల్లగా ఏమైనా ఉంటారా. నామ-రూపాలైతే మారిపోతాయి కదా. అయినా ఆత్మ నల్లగా అయిపోతుంది, భిన్న నామ, రూప, దేశ, కాలాలు ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరుగుతుంది, మేము మొదటి నుండి ఇప్పటివరకూ పాత్రను ఎలా అభినయిస్తూ వచ్చాము అన్నది మీరు అర్థం చేసుకున్నారు. మొదట దేవతలుగా ఉండేవారు, ఆ తర్వాత దేవతల నుండి అసురులుగా అయ్యారు. తండ్రి 84 జన్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు, దాని గురించి ఇంకెవరికీ తెలియదు. తండ్రే వచ్చి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నా ప్రియమైన పిల్లలూ, మీరు నాతోపాటు ఇంట్లో ఉండేవారు కదా. మీరు పరస్పరం సోదరులుగా ఉండేవారు కదా. ఆత్మలందరూ ఉండేవారు, అక్కడ శరీరాలు ఉండేవి కావు. తండ్రి ఉండేవారు మరియు సోదరులైన మీరుండేవారు, ఇంకే సంబంధమూ అక్కడ లేదు. తండ్రి అయితే పునర్జన్మలలోకి రారు. వారు డ్రామానుసారముగా రిజర్వులో ఉంటారు. వారి పాత్రయే ఆ విధంగా ఉంది. మీరు ఎంత సమయం పిలిచారు అనేది కూడా తండ్రి తెలియజేసారు. ద్వాపరము నుండి పిలవడం ప్రారంభించారని కాదు, అలా కాదు, చాలా సమయం తర్వాత మీరు పిలవడం మొదలుపెట్టారు. మిమ్మల్ని అయితే తండ్రి సుఖవంతులుగా తయారుచేస్తారు అనగా సుఖ వారసత్వాన్ని తండ్రి ఇస్తున్నారు. మీరు కూడా అంటారు - బాబా, మేము మీ వద్దకు కల్ప-కల్పమూ అనేక సార్లు వచ్చాము. ఈ చక్రము నడుస్తూనే ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి మిమ్మల్ని కలుసుకుంటారు మరియు ఈ వారసత్వాన్ని పొందుతారు. దేహధారులెవరైతే ఉన్నారో వారందరూ విద్యార్థులే. చదివించేవారు విదేహీ. ఇది వారి దేహము కాదు. వారు స్వయం విదేహీ, ఇక్కడకు వచ్చి దేహాన్ని ధారణ చేస్తారు. దేహము లేకుండా పిల్లలను ఎలా చదివించాలి. ఆత్మలందరికీ వారు తండ్రి. భక్తి మార్గములో అందరూ వారిని పిలుస్తారు. తప్పకుండా రుద్రమాలను స్మరిస్తారు. పైన పుష్పము ఉంటుంది మరియు ఆ తర్వాత జంటపూసలు ఉంటాయి. ఆ రెండు పూసలు ఒకేలా ఉంటాయి. ఆ మాలలో పుష్పానికి ఎందుకు నమస్కరిస్తారు, ఎవరి మాలను తిప్పుతారు అనేది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. దేవతల మాలను స్మరిస్తారా లేక మీ మాలను స్మరిస్తారా? మాల దేవతలదా లేక మీదా? దేవతలది అని అనరు. ఈ బ్రాహ్మణులనే తండ్రి కూర్చుని చదివిస్తారు. బ్రాహ్మణుల నుండి మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు చదువుకుంటారు, తర్వాత అక్కడకు వెళ్ళి దేవతా పదవిని పొందుతారు. మాల బ్రాహ్మణులైన మీదే, మీరు తండ్రి ద్వారా చదువుకుని, కష్టపడి మళ్ళీ దేవతలుగా అయిపోతారు. బలిహారమంతా (గొప్పతనమంతా) చదివించేవారిదే. తండ్రి పిల్లలకు ఎంత సేవను చేసారు. అక్కడైతే ఎవ్వరూ తండ్రిని స్మృతి కూడా చేయరు. భక్తి మార్గములో మీరు మాలను తిప్పేవారు. ఇప్పుడు ఆ పుష్పము వచ్చి మిమ్మల్ని కూడా పుష్పాలుగా తయారుచేస్తారు అనగా తమ మాలలోని మణులుగా తయారుచేస్తారు. మీరు పుష్పాల వలె తయారవుతారు కదా. ఆత్మ జ్ఞానము కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. మహిమ అంతా మీదే. బ్రాహ్మణులైన మీరు కూర్చుని మీ సమానంగా బ్రాహ్మణుల వలె తయారుచేసి ఆ తర్వాత స్వర్గవాసులైన దేవీ-దేవతలుగా తయారుచేస్తారు. దేవతలు స్వర్గములో ఉంటారు. మీరు ఎప్పుడైతే దేవతలుగా అవుతారో, అప్పుడు అక్కడ మీకు భూత, భవిష్యత్, వర్తమానాల జ్ఞానము ఉండదు.
ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీకే భూత, భవిష్యత్, వర్తమానాల జ్ఞానము లభిస్తుంది, ఇంకెవరికీ జ్ఞానము లభించదు. మీరు చాలా, చాలా భాగ్యశాలులు. కానీ మాయ మళ్ళీ మరపింపజేస్తుంది. మిమ్మల్ని ఈ బాబా ఏమీ చదివించరు. ఇతనూ ఒక మనిషియే, ఇతను కూడా చదువుకుంటున్నారు. ఇతను అందరికన్నా చివరిలో ఉండేవారు. అందరికన్నా నెంబర్ వన్ పతితుడైన వారే మళ్ళీ నెంబర్ వన్ పావనునిగా అవుతారు. ఎంత సుఖవంతులుగా ఉంటారు. లక్ష్యము మరియు ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతులుగా తయారుచేస్తారు. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ... ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. తండ్రి అంటారు, నేను వచ్చి ఆశీర్వదించినట్లయితే మరి అది అందరికీ ఇస్తూ ఉండాలి కదా. నేనైతే పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు వస్తాను. చదువు ద్వారానే మీకు అన్ని ఆశీర్వాదాలూ లభిస్తాయి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ విధంగా తండ్రి పర్ఫెక్ట్ గా ఉన్నారో - అలాగే స్వయాన్ని పర్ఫెక్ట్ గా తయారుచేసుకోవాలి. పవిత్రతను ధారణ చేసి తమ నడవడికను తీర్చిదిద్దుకోవాలి, సత్యమైన సుఖ-శాంతులను అనుభవం చేయాలి.
2. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుని బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారుచేసే సేవను చేయాలి. తమ ఉన్నతమైన భాగ్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.
| వరదానము:- |
ధారణా స్వరూపము ద్వారా సేవ చేసి సంతోషము అనే ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాధారీ భవ సేవా ఉల్లాసాన్ని ఉంచుకోవటము చాలా మంచిది కానీ ఒకవేళ పరిస్థితుల అనుసారంగా సేవ అవకాశము మీకు లభించకపోతే మీ అవస్థ పడిపోవటము లేక అలజడిలోకి రావటము అనేది జరగకూడదు. ఒకవేళ జ్ఞానాన్ని వినిపించే అవకాశము లభించకపోయినా కానీ మీరు మీ ధారణా స్వరూపము యొక్క ప్రభావము వేసినట్లయితే సేవా మార్కులు జమ అవుతాయి. ధారణా స్వరూపులైన పిల్లలే సత్యమైన సేవాధారులు. వారికి సర్వుల ఆశీర్వాదాలు మరియు సేవకు రిటర్నులో ప్రత్యక్ష ఫలముగా సంతోషము అనుభూతి అవుతుంది. |
| స్లోగన్:- | సత్యమైన హృదయముతో దాత, విధాత, వరదాతను రాజీ చేసినట్లయితే ఆత్మిక ఆనందములో ఉంటారు. |