తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 25 డిసెంబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి25 డిసెంబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

25-12-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - అడుగడుగునా శ్రీమతముపై నడవడము, ఇదే అన్నింటికన్నా ఉన్నతమైన చార్టు, ఏ పిల్లలకైతే శ్రీమతము పట్ల గౌరవము ఉంటుందో వారు మురళిని తప్పకుండా చదువుతారు’’
ప్రశ్న:- ఈశ్వరుని పిల్లలైన మిమ్మల్ని ఏ ప్రశ్న ఎవ్వరూ అడగలేరు?
జవాబు:- మీరు సంతుష్టముగా, సంతోషముగా ఉన్నారా అని పిల్లలైన మిమ్మల్ని ఎవ్వరూ అడగలేరు. ఎందుకంటే మేము సదా సంతుష్టముగా ఉన్నాము అని మీరు అంటారు. పరబ్రహ్మములో ఉండే ఆ తండ్రిని పొందాలి అన్న చింత ఉండేది, వారు లభించేసారు, ఇంకే విషయము గురించి చింతించాలి. మీరు రోగగ్రస్థులుగా ఉన్నా కానీ, మేము సంతుష్టముగా, సంతోషముగా ఉన్నాము అనే అంటారు. ఈశ్వరుని పిల్లలకు ఏ విషయము యొక్క చింతా లేదు. వీరిపై మాయ దాడి జరిగింది అని తండ్రి గమనించినప్పుడు - పిల్లలూ, సంతుష్టముగా, సంతోషముగా ఉన్నారా అని అడుగుతారు.

ఓం శాంతి. తండ్రి అర్థం చేయిస్తారు, బాబా తండ్రి కూడా, టీచర్ మరియు సుప్రీమ్ గురువు కూడా అన్నది పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. ఈ స్మృతిలో తప్పకుండా ఉంటారు. ఈ స్మృతిని ఎప్పుడూ ఎవ్వరూ నేర్పించలేరు. కల్ప-కల్పమూ తండ్రే వచ్చి నేర్పిస్తారు. వారు జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. జ్ఞానము యొక్క మూడవ నేత్రమైన దివ్య బుద్ధి లభించినప్పుడు ఇది అర్థం చేయించడం జరుగుతుంది. పిల్లలు అర్థం చేసుకుంటూ ఉండవచ్చు కానీ తండ్రినే మర్చిపోతుంటే మరి ఇక టీచర్, గురువు ఎలా గుర్తుకొస్తారు? మాయ చాలా ప్రబలమైనది, అది తండ్రి యొక్క మూడు రూపాలను మరపింపజేస్తుంది. మేము ఓడిపోయాము అని అంటారు. మామూలుగానైతే అడుగడుగులోనూ పదమాలు ఉంటాయి కానీ ఓడిపోతే పదమాలు ఎలా లభిస్తాయి? దేవతలకే పద్మమును గుర్తుగా చూపిస్తారు. ఇది ఈశ్వరుని చదువు. మనుష్యుల చదువు ఎప్పుడూ ఇలా ఉండదు. దేవతలకు మహిమ చేయడం జరుగుతుంది కానీ ఉన్నతోన్నతమైనవారు ఒక్క తండ్రే. ప్రపంచములోని వారి గొప్పతనమేముంది? ఈ రోజు గాడిద చాకిరి, రేపు రాజ్యము. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి ఇలా అవుతున్నారు. ఈ పురుషార్థములో ఎంతోమంది ఫెయిల్ అవుతారని మీకు తెలుసు. జ్ఞానమైతే చాలా సహజము, అయినా చాలా కొద్దిమందే పాస్ అవుతారు. ఎందుకు? మాయ ఘడియ-ఘడియ మరపింపజేస్తుంది. మీ చార్టు వ్రాయండి అని తండ్రి అంటారు కానీ వ్రాయలేకపోతారు. ఎంతవరకు కూర్చుని వ్రాస్తారు? ఒకవేళ వ్రాసినా కానీ కాసేపు పైకి, కాసేపు కిందికి అవుతుంది. ఎవరైతే అడుగడుగునా శ్రీమతమనుసారముగా నడుచుకుంటారో వారిదే అన్నింటికంటే ఉన్నతమైన చార్ట్. పాపం వీరికి సిగ్గుగా అనిపిస్తుందేమో అని తండ్రి అర్థం చేసుకుంటారు. లేకపోతే శ్రీమతాన్ని అమలులోకి తీసుకురావాలి. ఏదో ఒకటి రెండు శాతం మంది కష్టం మీద వ్రాస్తారు. శ్రీమతముపై అంతటి గౌరవము లేదు. మురళి లభిస్తుంది, అయినా కూడా చదవరు. వారికి మనసులో తప్పకుండా అనిపిస్తూ ఉండవచ్చు - బాబా చెప్తుంది నిజమే, మేము మురళిని చదవకపోతే ఇక ఇతరులకు ఏమి నేర్పిస్తాము అని.

తండ్రి అయితే అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే స్వర్గాధిపతులుగా అవుతారు, వీరిలో తండ్రి కూడా ఉన్నారు మరియు చదివించేవారు కూడా ఉన్నారు, అలాగే సద్గతిదాత కూడా ఉన్నారు. కొన్ని-కొన్ని పదాలలో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. దీనిని రివైజ్ చేయడం కోసం మీరు ఇక్కడకు వస్తారు. తండ్రి కూడా ఇదే అర్థం చేయిస్తారు ఎందుకంటే మేము మర్చిపోతాము అని మీరు స్వయమూ అంటారు, అందుకే రివైజ్ చేయడం కోసం మీరు ఇక్కడకు వస్తారు. ఎవరైనా రివైజ్ చేసుకున్నా కానీ రివైజ్ అవ్వదు. భాగ్యములో లేకపోతే పురుషార్థము కూడా ఏమి చేస్తారు. పురుషార్థము చేయించేవారైతే ఒక్క తండ్రే, ఇక్కడ ఎవరికీ విశేషమైన పాలన కూడా జరగదు. ఆ చదువులోనైతే ఎక్స్ ట్రా చదివించడానికి టీచరును పిలుస్తారు. ఇక్కడైతే భాగ్యాన్ని తయారుచేయడానికి అందరినీ ఒకే విధముగా చదివిస్తారు. ఒక్కొక్కరికి విడివిడిగా ఎంతవరకు చదివించగలరు - ఎంతమంది పిల్లలు ఉన్నారు! ఆ చదువులో ఎవరైనా గొప్ప వ్యక్తుల పిల్లలు ఉంటే, వారు ఆఫర్ చేస్తే, ఎక్స్ ట్రా కూడా చదివిస్తారు. వీరు డల్ గా ఉన్నారు అని టీచరుకు కూడా తెలుసు, అందుకే చదివించి వారిని స్కాలర్షిప్ కు యోగ్యులుగా తయారుచేస్తారు. ఈ టీచర్ అలా చేయరు. వీరైతే అందరినీ ఒకేలా చదివిస్తారు. ఎక్స్ ట్రా పురుషార్థము అనగా టీచర్ కొంత కృప చూపించడము. ఆ మాటకొస్తే ధనము కూడా తీసుకుంటారు, విశేషముగా సమయం కేటాయించి చదివిస్తారు, తద్వారా వారు ఎక్కువగా చదువుకుని చురుకైనవారిగా అవుతారు. ఈ తండ్రి అయితే అందరికీ ‘మన్మనాభవ’ అన్న ఒకే మహామంత్రాన్ని ఇస్తారు. అంతే. తండ్రి ఒక్కరే పతిత-పావనుడు, వారి స్మృతితోనే మనం పావనముగా అవుతాము. అది పిల్లలైన మీ చేతిలో ఉంది, ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పావనముగా అవుతారు. మొత్తం ఆధారమంతా ప్రతి ఒక్కరి పురుషార్థముపై ఉంది. వారు తీర్థయాత్రలు చేయడానికి వెళ్తారు. ఒకరినొకరు చూసి కూడా వెళ్తారు. పిల్లలైన మీరు కూడా ఎన్నో యాత్రలను చేసారు, ఆ తర్వాత ఏమి జరిగింది. కిందకు దిగుతూనే వచ్చారు. యాత్ర అనేది దేని కోసము, దాని నుండి ఏమి లభిస్తుంది! అన్నదేమీ తెలియదు. ఇప్పుడు మీది స్మృతి యాత్ర. ఒకటే పదము - మన్మనాభవ. మీ ఈ యాత్ర అనాది అయినది. వారు కూడా - మేము ఈ యాత్రలను అనాది కాలముగా చేస్తూ వచ్చాము అని అంటారు. మేము కల్ప-కల్పమూ ఈ యాత్రలను చేస్తాము అని మీరు ఇప్పుడు జ్ఞాన సహితముగా అంటారు. ఈ యాత్రను స్వయంగా తండ్రే వచ్చి నేర్పిస్తారు. ఆ యాత్రల్లో ఎంతగా ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు, ఎంత గొడవ జరుగుతుంది. ఇది డెడ్ సైలెన్స్ యొక్క యాత్ర. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, దాని ద్వారానే పావనముగా అయ్యేది ఉంది. మీకు తండ్రి ఈ సత్యాతి-సత్యమైన ఆత్మిక యాత్రను నేర్పించారు. ఆ యాత్రలనైతే మీరు జన్మజన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు, అయినా కానీ గానం చేస్తారు - నలువైపులా చుట్టి వచ్చాము... కానీ భగవంతుడి నుండైతే అన్నివేళలా దూరముగానే ఉన్నాము అని. యాత్రల నుండి వచ్చి మళ్ళీ వికారాలలో పడిపోతే ఇక దాని వల్ల లాభమేముంది. ఇది పురుషోత్తమ సంగమయుగమని, ఇప్పుడు తండ్రి వచ్చారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి వచ్చి ఉన్నారని ఒకరోజు అందరికీ తెలిసిపోతుంది. చివరికి భగవంతుడు ఎలా లభిస్తారు. ఇది ఎవరికీ తెలియదు. అసత్యమే తినడము, అసత్యమే తాగడము, అసత్యముగానే రాత్రిని గడపడము. అందుకే ఇది అసత్య ఖండము. సత్యఖండము అని స్వర్గాన్ని అంటారు. భారత్ యే స్వర్గముగా ఉండేది. స్వర్గములో అందరూ భారతవాసులే ఉండేవారు, ఈ రోజు ఆ భారతవాసులే నరకములో ఉన్నారు. మేము తండ్రి ద్వారా శ్రీమతాన్ని తీసుకుని భారత్ ను మళ్ళీ స్వర్గముగా తయారుచేస్తున్నాము అని మధురాతి-మధురమైన పిల్లలైన మీకు తెలుసు. ఆ సమయములో భారత్ లో ఇంకెవరూ ఉండరు. మొత్తం విశ్వమంతా పవిత్రముగా అయిపోతుంది. ఇప్పుడైతే ఎన్ని లెక్కలేనన్ని ధర్మాలున్నాయి. తండ్రి మొత్తం వృక్షము యొక్క జ్ఞానమంతటినీ వినిపిస్తారు. మీకు మళ్ళీ స్మృతిని కలిగిస్తారు. మీరే దేవతలుగా ఉండేవారు, మళ్ళీ వైశ్య, శూద్రులుగా అయ్యారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయ్యారు. ఈ పదాలను సన్యాసులు, విద్వాంసులు మొదలైనవారెవరి ద్వారానైనా ఎప్పుడైనా విన్నారా? ఈ హం సో అన్న పదము అర్థాన్ని తండ్రి ఎంత సహజము చేసి వినిపిస్తారు. హం సో అనగా నేను ఆత్మను, ఆత్మనైన నేను ఇలా, ఇలా చక్రము చుట్టి వస్తాను అని అర్థము. వారు - ఆత్మయైన మనమే పరమాత్మ, పరమాత్మయే ఆత్మయైన మనము అని అనేస్తారు. హం సో పదము యొక్క అర్థము తెలిసినవారు ఒక్కరు కూడా లేరు. తండ్రి అంటారు, ఈ హం సో అన్న మంత్రమేదైతే ఉందో, అది సదా బుద్ధిలో గుర్తుండాలి. లేకపోతే చక్రవర్తీ రాజులుగా ఎలా అవుతారు. వారైతే 84 జన్మల అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. భారత్ యొక్క ఉన్నతి మరియు పతనము అనే అంటూ ఉంటారు. సతోప్రధానము, సతో, రజో, తమో. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు...

ఇప్పుడు పిల్లలైన మీకు అంతా తెలిసిపోయింది. బీజరూపుడైన ఒక్క తండ్రినే జ్ఞానసాగరుడు అని అంటారు. వారు ఈ సృష్టిచక్రములోకి రారు. ఆత్మయైన మనమే పరమాత్మగా అయిపోతామని కాదు. అలా కాదు. తండ్రి తమ సమానముగా నాలెడ్జ్ ఫుల్ గా తయారుచేస్తారు. తమ సమానముగా భగవంతుడిలా చేయరు. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవాలి, అప్పుడే బుద్ధిలో చక్రము తిరగగలదు. మేము ఏ విధముగా 84 జన్మల చక్రములోకి వస్తాము అన్నది మీరు బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలరు. ఇందులో సమయము, వర్ణాలు, వంశావళులు అన్నీ వచ్చేస్తాయి. ఈ జ్ఞానము ద్వారానే ఉన్నతోన్నతముగా అవుతారు. జ్ఞానము ఉంటే ఇతరులకు కూడా ఇస్తారు. ఆ స్కూళ్ళలో పరీక్షలు జరిగినప్పుడు పేపర్లు మొదలైనవి వ్రాయిస్తారు. పేపర్లు విదేశాల నుండి వస్తాయి. ఎవరైతే విదేశాలలో చదువుకుంటూ ఉంటారో, వారిని కూడా ఎవరైనా పెద్ద ఎడ్యుకేషన్ మినిస్టర్ పరిశీలిస్తూ ఉండవచ్చు. ఇక్కడ మీ పేపర్లను ఎవరు పరిశీలిస్తారు? మీరు స్వయమే పరిశీలిస్తారు. మీరు స్వయం ఎలా అవ్వాలనుకుంటే అలా అవ్వండి. చదువుకుని తండ్రి నుండి ఏ పదవి కావాలనుకుంటే అది తీసుకోండి. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, ఇతరులకు సేవ చేస్తారో, అంతగానే ఫలము లభిస్తుంది. రాజధాని స్థాపన అవుతోందంటే ప్రజలు కూడా కావాలి కదా అని వారికి సేవ యొక్క చింత ఉంటుంది. అక్కడ మంత్రులు మొదలైనవారి అవసరం ఉండదు. ఇక్కడ ఎప్పుడైతే తెలివి తగ్గుతుందో అప్పుడు మంత్రుల అవసరం ఏర్పడుతుంది. బాబా, ధనముంది, ఏమి చెయ్యాలి, వ్యాపారము ఎలా చేయాలి అని ఇక్కడ తండ్రి వద్దకు కూడా సలహా తీసుకునేందుకు వస్తారు. తండ్రి అంటారు, ఈ ప్రపంచపు వ్యాపారాలు మొదలైనవాటి విషయాలను ఇక్కడకు తీసుకురాకండి. అయితే, ఎవరైనా బాగా నిరుత్సాహపడిపోతే వారికి ఎంతోకొంత ధైర్యాన్ని ఇచ్చేందుకు చెప్తారు. కానీ ఇది నా పనేమీ కాదు. నా పని మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారుచేసి విశ్వాధిపతులుగా తయారుచేయడము. మీరు తండ్రి నుండి శ్రీమతాన్ని సదా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే అందరిదీ ఆసురీ మతమే. అక్కడ అది సుఖధామము. మీరు సంతుష్టముగా, సంతోషముగా ఉన్నారా, ఆరోగ్యము బాగుందా అని అక్కడ ఎప్పుడూ ఎవరూ అడగరు. ఇలాంటి విషయాలను ఇక్కడే అడుగుతారు. అక్కడ అసలు ఈ మాటలే ఉండవు. దుఃఖధామపు మాటలేవీ ఉండవు. కానీ తండ్రికి తెలుసు - పిల్లలలో మాయ ప్రవేశము జరిగిన కారణముగా తండ్రి అడగవచ్చు - మీరు సరిగ్గా ఉన్నారా, సంతుష్టముగా, సంతోషముగా ఉన్నారా? మనుష్యులు ఇక్కడి మాటలను అర్థం చేసుకోలేరు. ఎవరైనా మనుష్యులు మిమ్మల్ని అడిగితే మీరు వారికి చెప్పవచ్చు - మేము ఈశ్వరుని పిల్లలము, మా క్షేమ-సమాచారాలు ఏమడుగుతారు? పరబ్రహ్మములో ఉండే తండ్రిని పొందాలి అన్ని చింత ఉండేది, ఇప్పుడు వారు లభించేసారు, ఇప్పుడింకే చింత. ఇది సదా గుర్తుండాలి. మనము ఎవరి సంతానము - ఈ జ్ఞానము కూడా బుద్ధిలో ఉంది. ఎప్పుడైతే మనం పావనముగా అయిపోతామో అప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది. మిమ్మల్ని తప్పకుండా అడుగుతారు. మీరు అంటారు, మేమైతే సదా సంతుష్టముగా ఉంటాము. రోగగ్రస్థులుగా ఉన్నా కూడా సంతుష్టముగానే ఉంటారు. బాబా స్మృతిలో ఉన్నట్లయితే మీరు స్వర్గములో కంటే ఇక్కడే ఎక్కువ సంతుష్టముగా ఉంటారు. స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చే తండ్రి మీకు లభించారు. వారు మనల్ని ఎంత యోగ్యులుగా తయారుచేస్తారు, మరి ఇక మనకు చింత ఏముంది! ఈశ్వరుని పిల్లలకు ఏ విషయములో చింత? అక్కడ దేవతలకు కూడా ఏ చింతా ఉండదు. దేవతల పైన ఈశ్వరుడు ఉంటారు. మరి ఈశ్వరుని పిల్లలకు ఏమి చింత ఉండగలదు? బాబా మనల్ని చదివిస్తున్నారు. బాబా మన టీచర్, సద్గురువు. బాబా మన శిరస్సుపై కిరీటాన్ని పెడతారు. వారిని ఇంగ్లీషులో క్రౌన్ ప్రిన్స్ అని అంటారు. తండ్రి కిరీటాన్ని కొడుకు ధరిస్తాడు. సత్యయుగములో అంతా సుఖమే సుఖము ఉంటుందని మీరు అర్థం చేసుకోగలరు. ఎప్పుడైతే అక్కడకు వెళ్తారో అప్పుడే ప్రాక్టికల్ గా ఆ సుఖాన్ని పొందుతారు. సత్యయుగములో ఏమవుతుంది, ఈ శరీరాన్ని వదిలి మనం ఎక్కడికి వెళ్తాము అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ప్రాక్టికల్ గా తండ్రి చదివిస్తున్నారు. మనం నిజంగానే స్వర్గములోకి వెళ్తామని మీకు తెలుసు. ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని వారు అంటారు కానీ, వారికి స్వర్గము మరియు నరకము అని దేనినంటారో తెలియదు. కల్పము యొక్క ఆయువునే లక్షల సంవత్సరాలుగా వ్రాసేసారు. జన్మజన్మాంతరాలూ ఈ జ్ఞానాన్ని వింటూ, వింటూ కిందకు దిగజారుతూ వచ్చారు. మేము ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చి పడిపోయాము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. సత్యయుగము నుండి పడిపోతూనే వచ్చారు. ఇప్పుడు మనము ఈ పురుషోత్తమ సంగమయుగములోకి చేరుకున్నాము. చదివించడానికి కల్ప-కల్పమూ తండ్రి వస్తారు. తండ్రి వద్ద మీరు ఉంటారు కదా. వీరే మన సత్యాతి-సత్యమైన సద్గురువు, వీరు ముక్తి-జీవన్ముక్తుల దారిని చూపిస్తారు. ఏ విధంగా ఈ బాబా కూడా నేర్చుకుంటారో, అలా వీరిని చూసి పిల్లలైన మీరు కూడా నేర్చుకుంటారు. అడుగడుగులోనూ అప్రమత్తముగా ఉండవలసి ఉంటుంది. మనసా, వాచా, కర్మణా చాలా శుద్ధముగా ఉండాలి. లోపల ఎటువంటి అశుద్ధత ఉండకూడదు. తండ్రిని ఘడియ, ఘడియ పిల్లలు మర్చిపోతారు. తండ్రిని మర్చిపోవడం వలన తండ్రి శిక్షణను కూడా మర్చిపోతారు. మేము విద్యార్థులము అన్నది కూడా మర్చిపోతారు. వాస్తవానికి ఇది చాలా సహజము. తండ్రి స్మృతిలోనే అద్భుతమంతా ఉంది. ఇటువంటి అద్భుతాన్ని ఇంకే తండ్రీ నేర్పించలేరు. ఈ అద్భుతము ద్వారానే తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవుతారు.

శివబాబా బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసారని పిల్లలైన మీకు తెలుసు. ఆ ధర్మము సత్య-త్రేతాయుగాలు, అర్ధకల్పము కొనసాగుతుంది. ఇతర ధర్మాలవారు తరువాత వృద్ధి పొందుతారు. ఉదాహరణకు క్రైస్టు వచ్చారు, ప్రారంభములో చాలా కొద్దిమంది మాత్రమే ఉండేవారు. ఎప్పుడైతే చాలా వృద్ధి చెందుతారో, అప్పుడు రాజ్యాన్ని పరిపాలించగలరు. క్రిస్టియన్ ధర్మము ఇప్పటివరకూ ఉంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. క్రైస్టు ద్వారా మనము క్రిస్టియన్లుగా అయ్యామని వారికి తెలుసు. నేటికి రెండు వేల సంవత్సరాలకు ముందు క్రైస్టు వచ్చారు. ఇప్పుడు వృద్ధి జరుగుతోంది. మేము క్రైస్టుకు చెందినవారము అని క్రిస్టియన్లు అంటారు. మొదట క్రైస్టు ఒక్కరే వచ్చారు, ఆ తర్వాత వారి ధర్మ స్థాపన జరుగుతుంది, వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు... ఇలా వృద్ది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్రిస్టియన్ల వృక్షము ఎంతగా పెరిగిపోయింది. పునాది దేవీ-దేవతా ధర్మమే, అందుకే బ్రహ్మాను గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. కానీ మేము పరమపిత శివ పరమాత్ముని డైరెక్ట్ పిల్లలము అన్నది భారతవాసులు మర్చిపోయారు.

ఆది దేవ్ ఒకప్పుడు ఉండి వెళ్ళారని, ఈ మనుష్య వంశావళి వారిదేనని క్రిస్టియన్లు కూడా భావిస్తారు. కానీ వారు తమ క్రైస్టునే నమ్ముతారు. క్రైస్టును, బుద్ధుడిని తండ్రిగా భావిస్తారు. వంశవృక్షము ఉంది కదా. ఏ విధముగా క్రైస్టు స్మృతిచిహ్నాలు క్రిస్టియన్ దేశాలలో ఉన్నాయో, అలా పిల్లలైన మీరు ఇక్కడ తపస్య చేసారు కావున మీ స్మృతిచిహ్నాలు ఇక్కడ (ఆబూలో) ఉన్నాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. డెడ్ సైలెన్స్ తో కూడిన సత్యాతి-సత్యమైన ఆత్మిక యాత్రను చేయాలి. హం సో మంత్రాన్ని సదా గుర్తుంచుకోవాలి, అప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు.

2. మనసా-వాచా-కర్మణా చాలా శుద్ధముగా ఉండాలి. లోపల ఎటువంటి అశుద్ధత ఉండకూడదు. అడుగడుగునా అప్రమత్తముగా ఉండాలి. శ్రీమతముపై గౌరవము ఉంచాలి.

వరదానము:- నిర్మానతా గుణాన్ని ధారణ చేసి అందరికీ సుఖాన్ని ఇచ్చే సుఖ దేవ, సుఖ స్వరూప భవ
మహాన్ ఆత్మలైన మీ గుర్తు నిర్మానత. ఎంతగా నిర్మానచిత్తులుగా అవుతారో అంతగా సర్వుల ద్వారా గౌరవము ప్రాప్తిస్తుంది. ఎవరైతే నిర్మానులుగా ఉంటారో వారు అందరికీ సుఖాన్ని ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా వారు సుఖమిచ్చేవారిగా ఉంటారు. కావున ఎవరు సంబంధ-సంపర్కములోకి వచ్చినా వారు సుఖాన్ని అనుభూతి చేయాలి, అందుకే బ్రాహ్మణ ఆత్మలైన మీ గాయనము - సుఖ సాగరుని పిల్లలు సుఖ స్వరూపులు, సుఖ దేవులు. కావున అందరికీ సుఖాన్ని ఇస్తూ మరియు సుఖాన్ని తీసుకుంటూ వెళ్ళండి. ఎవరైనా మీకు దుఃఖాన్ని ఇస్తే తీసుకోకండి.
స్లోగన్:- ఎవరైతే ఆత్మ-అభిమానులుగా ఉంటారో, వారే అందరికంటే గొప్ప జ్ఞానులు.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.