తెలుగు మురళి · Brahma Kumaris

తెలుగు మురళి · 27 డిసెంబర్, 2024

ఓం శాంతి · BapDada ·

ఈరోజు మురళి — today’s murli in Telugu, BK Telugu murli.

18
మురళి27 డిసెంబర్, 2024 · తెలుగు
0:00--:--

పాఠ్యాన్ని ఎంచుకోండి → హైలైట్ / బాక్స్ / అండర్‌లైన్

27-12-2024
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
మధువనం

‘‘మధురమైన పిల్లలూ - మాయ చాలా శక్తివంతమైనది, దీనితో జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడూ కూడా - మేము బ్రహ్మాను అంగీకరించము, మాకు డైరెక్ట్ గా శివబాబాతో కనెక్షన్ ఉంది అన్న ఆలోచన రాకూడదు’’
ప్రశ్న:- ఎటువంటి పిల్లల పట్ల అందరికీ స్వతహాగా ప్రేమ కలుగుతుంది?
జవాబు:- ఎవరైతే ప్రతి విషయాన్ని ముందు స్వయం ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చి, ఆ తర్వాత ఇతరులకు చెప్తారో - వారి పట్ల అందరికీ స్వతహాగా ప్రేమ కలుగుతుంది. జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసి, ఆ తర్వాత అనేకుల సేవను చెయ్యాలి, అప్పుడు అందరి ప్రేమ లభిస్తుంది. ఒకవేళ స్వయం చెయ్యకుండా కేవలం ఇతరులకే చెప్తే, వారు చెప్పింది ఎవరు వింటారు? వారు పండితుల వలె అయినట్లు.

ఓం శాంతి. పిల్లలను తండ్రి అడుగుతున్నారు, ఆత్మలను పరమాత్మ అడుగుతున్నారు - మేము పరమపిత పరమాత్మ ఎదురుగా కూర్చొన్నాము అన్నదైతే తెలుసా. బాబాకు తన రథము లేదు, ఈ నిశ్చయమైతే ఉంది కదా? ఈ భృకుటి మధ్యలో తండ్రి నివాస స్థానము ఉంది. తండ్రి స్వయంగా చెప్పారు - నేను వీరి భృకుటి మధ్యలో కూర్చుంటాను, ఇతని శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను. ఆత్మ భృకుటి మధ్యలో కూర్చుంటుంది కావున తండ్రి కూడా ఇక్కడికే వచ్చి కూర్చుంటారు. బ్రహ్మా కూడా ఉన్నారు, అలాగే శివబాబా కూడా ఉన్నారు. ఒకవేళ ఈ బ్రహ్మా లేకపోతే శివబాబా కూడా ఉండరు. ఒకవేళ ఎవరైనా - మేము శివబాబానే స్మృతి చేస్తాము, బ్రహ్మాను స్మృతి చెయ్యము అని అంటే, మరి శివబాబా ఎలా మాట్లాడుతారు? శివబాబాను పైన అయితే ఎంతోకాలంగా స్మృతి చేస్తూనే వచ్చారు. మేము తండ్రి వద్ద ఇక్కడ కూర్చున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. శివబాబా పైన ఉన్నారు అని అనుకోరు. శివబాబా పైన ఉన్నారని, వారి ప్రతిమ ఇక్కడ పూజింపబడుతోందని భక్తి మార్గములో అనేవారు. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవలసినవి. తండ్రి జ్ఞానసాగరుడని, నాలెడ్జ్ ఫుల్ అని తెలుసు కదా, మరి వారు ఎక్కడి నుండి జ్ఞానాన్ని వినిపిస్తారు? బ్రహ్మా తనువు ద్వారా వినిపిస్తారు. కొందరు, మేము బ్రహ్మాను అంగీకరించము అని అంటారు, కానీ శివబాబా అంటారు, నేను ఈ ముఖము ద్వారానే నన్ను స్మృతి చేయమని మీకు చెప్తాను. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. శివబాబాను స్మృతి చెయ్యండి అని బ్రహ్మా స్వయం అంటారు. నన్ను స్మృతి చేయండి అని ఇతను ఎక్కడ అన్నారు? నన్ను స్మృతి చెయ్యండి అని ఇతని ద్వారా శివబాబా అంటారు. ఈ మంత్రాన్ని నేను ఇతని నోటి ద్వారా ఇస్తాను. బ్రహ్మా లేకపోతే నేను మంత్రమునెలా ఇస్తాను? బ్రహ్మా లేకపోతే మీరు శివబాబాతో ఎలా కలుసుకుంటారు? నా వద్ద ఎలా కూర్చుంటారు? మంచి-మంచి మహారథులకు కూడా ఎటువంటి ఆలోచనలు వస్తాయంటే, ఇక మాయ వారిని నా నుండి విముఖులుగా చేస్తుంది. మేము బ్రహ్మాను అంగీకరించమని అంటే, అటువంటివారి గతి ఏమవుతుంది? మాయ ఎంత ప్రబలమైనది, ఒక్కసారిగా ముఖాన్ని తిప్పేస్తుంది. ఇప్పుడు మీ ముఖాన్ని శివబాబా ముందుకు తిప్పారు. మీరు సమ్ముఖములో కూర్చున్నారు. ఎవరైతే బ్రహ్మా ఏమీ కాదు అని అనుకుంటారో, వారి గతి ఏమవుతుంది? దుర్గతిని పొందుతారు. మనుష్యులు - ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు! మరి ఆ గాడ్ ఫాదర్ వింటారా? ఓ లిబరేటర్ (ముక్తిదాత), రండి అని అంటారు. మరి అక్కడి నుండే విముక్తులుగా చేస్తారా? కల్ప-కల్పపు పురుషోత్తమ సంగమయుగములోనే తండ్రి వస్తారు. ఎవరిలోకైతే వస్తారో వారినే పక్కన పెట్టేస్తే మరి ఇంకేమంటారు? మాయలో ఎంత బలముందంటే అది నంబర్ వన్ పైసకు కొరగానివారిగా చేసేస్తుంది. ఇటువంటివారు కూడా కొన్ని-కొన్ని సెంటర్లలో ఉన్నారు, అందుకే తండ్రి జాగ్రత్తగా ఉండండి అని అంటారు. బాబా వినిపించిన జ్ఞానాన్ని ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు, కానీ పండితుల మాదిరిగా. బాబా పండితుని కథ వినిపిస్తారు కదా... ఈ సమయములో మీరు తండ్రి స్మృతితో విషయసాగరాన్ని దాటి, క్షీరసాగరములోకి వెళ్తారు కదా! భక్తి మార్గములో అనేక కథలను తయారుచేసారు. పండితుడు రామ నామాన్ని జపించటముతో నదిని దాటివేయవచ్చు అని ఇతరులకు చెప్తుండేవారు, కానీ అతను మాత్రం అతని ఖాతాలో ఏమీ జమ చేసుకోలేదు. స్వయం వికారాలలోకి వెళ్తూ ఉండడం, కానీ ఇతరులకు నిర్వికారులుగా అవ్వండి అని చెప్తూ ఉంటే, వారి ప్రభావమేముంటుంది? ఇక్కడ కూడా అక్కడక్కడా, వినిపించే వారికన్నా వినేవారు చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. ఎవరైతే అనేకుల సేవ చేస్తారో, వారు తప్పకుండా అందరికీ ప్రియమనిపిస్తారు. పండితుడు అసత్యమైనవారు అని బయటపడ్డ తర్వాత అతడిని ఎవరు ప్రేమిస్తారు? ఎవరైతే ప్రాక్టికల్ గా స్మృతి చేస్తారో, ఇక ప్రేమ వారివైపుకు వెళ్ళిపోతుంది. మంచి-మంచి మహారథులను కూడా మాయ మింగేస్తుంది.

బాబా అర్థం చేయిస్తారు - ఇప్పుడింకా కర్మాతీత అవస్థ తయారవ్వలేదు, యుద్ధము కొరకు ఏర్పాటు అవ్వనంతవరకు అది తయారవ్వదు. ఒకవైపు యుద్ధపు ఏర్పాటు జరుగుతుంది, ఇంకొకవైపు కర్మాతీత అవస్థ ఉంటుంది. పూర్తి కనెక్షన్ ఉంది. ఆ తర్వాత యుద్ధము పూర్తి అయిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతారు. మొదట రుద్రమాల తయారవుతుంది. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. ఈ ప్రపంచము మారాలి అని మీరు అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచానికి ఇంకా 40 వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయని వారు భావిస్తారు. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని మీరు భావిస్తారు. మీది మైనారిటీ, వారిది మెజారిటీ, మరి మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఎప్పుడైతే మీ వృద్ధి జరుగుతుందో అప్పుడు మీ యోగబలముతో ఎంతోమంది ఆకర్షితులై వస్తారు, ఎంతగా మీ లోపల నుండి తుప్పు తొలగుతూ ఉంటుందో అంతగా బలము నిండుతూ ఉంటుంది. బాబా అన్నీ తెలిసినవారు అని కాదు కానీ వారికి అందరి అవస్థల గురించి తెలుసు. తండ్రికి పిల్లల అవస్థ గురించి తెలియదా? ప్రతి విషయము తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడదు. చాలా కఠినమైన పొరపాట్లు జరగడం కూడా సంభవమే, మహారథుల ద్వారా కూడా జరుగుతాయి. మాటతీరు, నడత-నడవడిక మొదలైనవన్నీ ప్రసిద్ధమైపోతాయి. ఇప్పుడైతే దైవీ నడవడికను తయారుచేసుకోవాలి. దేవతలు సర్వగుణ సంపన్నులు కదా. ఇప్పుడు మీరు అలా తయారవ్వాలి. కానీ మాయ ఎవ్వరినీ వదలదు. ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిగా చేసేస్తుంది. 5 మెట్లు ఉన్నాయి కదా. దేహాభిమానము రావడముతో పై నుండి ఒక్కసారిగా పడిపోతారు. పడ్డారంటే చనిపోయినట్లే. ఈ రోజుల్లో తమను తాము హతమార్చుకునేందుకు ఎలాంటి, ఎలాంటి ఉపాయాలు రచిస్తారు! 20 అంతస్తులపై నుండి దూకి ఒకేసారి అంతమైపోతారు. హాస్పిటల్లో పడి ఉండడం, దుఃఖాన్ని అనుభవించడం కూడా జరగకూడదు. మరికొందరు తమకు తాము నిప్పు అంటించుకుంటారు, ఎవరైనా వారిని రక్షిస్తే ఎంత దుఃఖము అనుభవిస్తారు. కాలిపోతే ఆత్మ పారిపోతుంది, అందుకే జీవహత్య చేసుకుంటారు. జీవహత్య చేసుకోవడం ద్వారా దుఃఖాల నుండి ముక్తులవుతాము అని భావిస్తారు. ఆవేశం వస్తే ఇక అంతే. కొందరైతే హాస్పిటల్లో ఎంత దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇతను దుఃఖము నుండి విముక్తి కాలేడు, దీని కంటే ఏదన్నా మాత్ర ఇస్తే ఇతను చనిపోతాడు, మంచిది కదా అని డాక్టరు భావిస్తారు, కానీ వారు ఇలా మాత్రలు ఇవ్వడము మహాపాపమని భావిస్తారు. ఆత్మే స్వయం అంటుంది, ఈ బాధను భరించడం కన్నా శరీరం వదిలేయడమే మంచిది అని. ఇప్పుడు శరీరాన్ని ఎవరు వదిలింపజేయాలి. ఇది అపారమైన దుఃఖాల ప్రపంచము. అక్కడ అపారమైన సుఖము ఉంటుంది.

మనము ఇప్పుడు తిరిగి వెళ్తున్నాము, దుఃఖధామము నుండి సుఖధామానికి వెళ్తాము కావున వారిని స్మృతి చెయ్యాలి అని పిల్లలైన మీరు భావిస్తారు. తండ్రి కూడా సంగమయుగములో, ఎప్పుడైతే ప్రపంచము మారేది ఉంటుందో, అప్పుడే వస్తారు. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని సర్వ దుఃఖాల నుండి విడిపించి కొత్త, పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళడానికి వచ్చాను. పావన ప్రపంచములో కొద్దిమందే ఉంటారు, ఇక్కడైతే చాలామంది ఉన్నారు. పతితులుగా అయ్యారు, అందుకే ఓ పతిత పావనా... అని పిలుస్తారు. మమ్మల్ని ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి ఇంటికి తీసుకువెళ్ళేందుకు మేము మహాకాలుడిని పిలుస్తున్నాము అని భావించరు. తప్పకుండా బాబా వస్తారు, అందరూ మరణిస్తారు, అప్పుడే శాంతి ఏర్పడుతుంది కదా. శాంతి-శాంతి అని అంటూ ఉంటారు. శాంతి అయితే శాంతిధామములో ఉంటుంది. కానీ ఎప్పటివరకైతే ఇంతమంది మనుష్యులు ఉంటారో, అప్పటివరకు ఈ ప్రపంచములో శాంతి ఎలా ఉంటుంది? సత్యయుగములో సుఖ-శాంతులు ఉండేవి. ఇప్పుడైతే కలియుగములో అనేక ధర్మాలు ఉన్నాయి. అవన్నీ సమాప్తమై, ఏక ధర్మ స్థాపన జరిగినప్పుడే సుఖ-శాంతులు ఉంటాయి. హాహాకారాల తర్వాత జయజయకారాలు ఉంటాయి. మృత్యువు బజారు ఎంత వేడిగా ఉంటుంది, ఎలా మరణిస్తారు అనేది మున్ముందు చూడండి! బాంబుల ద్వారా కూడా మంటలు అంటుకుంటాయి. మున్ముందు చూస్తే, ఇక తప్పకుండా వినాశనము జరిగి తీరుతుందని ఎంతోమంది అంటారు.

ఈ సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది అనేది పిల్లలైన మీకు తెలుసు. వినాశనమైతే తప్పకుండా జరగవలసిందే. ఏక ధర్మ స్థాపనను తండ్రి చేయిస్తారు, రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. మిగిలిన అనేక ధర్మాలన్నీ అంతమైపోతాయి. గీతలో ఇదేమీ చూపించలేదు. మరి గీతను చదవడం వలన ఫలితమేముంది? ప్రళయం జరిగిపోయిందని చూపిస్తారు. జలమయమయితే అవుతుంది కానీ మొత్తం ప్రపంచమంతా జలమయమవ్వదు. భారత్ అయితే అవినాశీ పవిత్ర ఖండము. అందులోనూ ఆబు అన్నింటికంటే పవిత్రమైన తీర్థస్థానము, అక్కడికి తండ్రి వచ్చి సర్వుల సద్గతిని చేస్తారు. దిల్వాడా మందిరము ఎంత చక్కటి స్మృతిచిహ్నము. ఎంత అర్థ సహితముగా ఉంది. కానీ ఎవరైతే తయారుచేసారో వారికి ఇది తెలియదు. అయినా గొప్ప తెలివైనవారే కదా. ద్వాపరములో తప్పకుండా మంచి తెలివైనవారే ఉంటారు. కలియుగములోనైతే అందరూ తమోప్రధానులే. అన్ని మందిరాలకన్నా ఇది ఉన్నతమైనది, అక్కడ మీరు కూర్చున్నారు. మేము చైతన్యముగా ఉన్నాము, అవి మా జడ మూర్తులేనని మీకు తెలుసు. ఇంకా కొద్ది సమయము వరకు ఈ మందిరాలు మొదలైనవి ఇంకా తయారవుతూ ఉంటాయి. తర్వాత ఇక కూలిపోయే సమయము వస్తుంది. మందిరాలు మొదలైనవన్నీ విరిగిపోయి కూలిపోతాయి. హోల్ సేల్ మృత్యువు జరుగుతుంది. మహాభారీ మహాభారత యుద్ధమని గానం చేయబడింది కదా, అందులో అందరూ అంతమైపోతారు. తండ్రి సంగమములోనే వస్తారని కూడా మీరు అర్థం చేసుకుంటారు. తండ్రికి రథమైతే కావాలి కదా. ఆత్మ ఎప్పుడైతే శరీరములోకి వస్తుందో, అప్పుడే కదలికలు మొదలవుతాయి. ఆత్మ శరీరము నుండి బయటకు వెళ్ళిపోతే శరీరము జడమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు. మీరు లక్ష్మీ-నారాయణుల వలె తయారవ్వాలి. కావున అటువంటి గుణాలు కూడా కావాలి కదా. పిల్లలైన మీకు ఈ ఆట గురించి కూడా తెలుసు. ఈ ఆట ఎంత అద్భుతముగా తయారుచేయబడి ఉంది. ఈ ఆట రహస్యాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి నాలెడ్జ్ ఫుల్, బీజరూపుడు కదా. తండ్రియే వచ్చి మొత్తము వృక్షము యొక్క జ్ఞానమంతా ఇస్తారు, ఇందులో ఏమేమి జరుగుతుంది, మీరు ఇందులో ఎంత పాత్రను అభినయించారు అనే జ్ఞానమంతా ఇస్తారు. అర్ధకల్పము దైవీ రాజ్యము, అర్ధకల్పము ఆసురీ రాజ్యము. ఎవరైతే మంచి-మంచి పిల్లలో వారి బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంటుంది. తండ్రి తన సమానముగా టీచరుగా తయారుచేస్తారు. టీచర్లు కూడా నంబరువారుగా ఉంటారు. కొందరైతే టీచర్లుగా అయి మళ్ళీ పాడైపోతారు. అనేకమందికి నేర్పించి స్వయం అంతమైపోతారు. చిన్న-చిన్న పిల్లల్లో భిన్న-భిన్న సంస్కారాలు ఉంటాయి. తండ్రి అర్థం చేయిస్తారు, ఇక్కడ కూడా ఎవరైతే జ్ఞానాన్ని సరైన విధంగా అర్థం చేసుకోరో, తమ నడవడికను తీర్చిదిద్దుకోరో, వారు అనేకులకు దుఃఖాన్ని ఇచ్చేందుకు నిమిత్తులవుతారు. అసురులు దాక్కొని కూర్చునేవారని, మళ్ళీ బయటకు వెళ్ళి ద్రోహులై ఎంత విసిగించేవారని కూడా శాస్త్రాలలో చూపించారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఉన్నతోన్నతమైన తండ్రి స్వర్గ స్థాపన చేస్తుంటే ఎంతమంది విఘ్నరూపులుగా అవుతారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలైన మీరు సుఖ-శాంతుల టవర్ వంటివారు. మీరు చాలా రాయల్ పిల్లలు. మీకన్నా రాయల్ గా ఈ సమయములో ఇంకెవ్వరూ ఉండరు. అనంతమైన తండ్రికి పిల్లలు కావున ఎంత మధురముగా నడుచుకోవాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు లేకపోతే అవి అంతిమములో గుర్తుకువస్తాయి. అప్పుడు శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. తండ్రి అంటారు, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. సూక్ష్మవతనములో పిల్లలకు బ్రహ్మా సాక్షాత్కారము అవుతుంది, అందుకే మీరు కూడా ఈ విధంగా సూక్ష్మవతనవాసులుగా అవ్వండి. మూవీ అభ్యాసము చెయ్యాలి. చాలా తక్కువగా మాట్లాడాలి, మధురముగా మాట్లాడాలి. ఇలా పురుషార్థము చేస్తూ, చేస్తూ మీరు శాంతి టవర్ (శాంతి స్తంభము) గా అయిపోతారు. మీకు నేర్పించేవారు తండ్రి. తర్వాత మీరు ఇతరులకు నేర్పించాలి. భక్తి మార్గము టాకీ మార్గము. ఇప్పుడు మీరు సైలెన్స్ గా తయారవ్వాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చాలా రాయల్ గా మధురముగా నడుచుకోవాలి. శాంతి మరియు సుఖము యొక్క టవర్ గా అయ్యేందుకు చాలా తక్కువగా మరియు మధురముగా మాట్లాడాలి. మూవీని (సంకేతాలను) ప్రాక్టీస్ చెయ్యాలి. టాకీ (శబ్దము) లోకి రాకూడదు.

2. స్వయం యొక్క నడవడికను దైవీ నడవడికగా తయారుచేసుకోవాలి. ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిలా అవ్వకూడదు. యుద్ధము కంటే ముందే కర్మాతీత అవస్థ వరకు చేరుకోవాలి. నిర్వికారులుగా అయ్యి నిర్వికారులుగా తయారుచేసే సేవ చెయ్యాలి.

వరదానము:- పవిత్రమైన ప్రేమ యొక్క పాలన ద్వారా సర్వులను స్నేహ సూత్రములో బంధించే మాస్టర్ స్నేహ సాగర భవ
ఎప్పుడైతే స్నేహ సాగరము మరియు స్నేహ సంపన్నమైన నదుల యొక్క మేళా జరుగుతుందో, అప్పుడు నది కూడా తండ్రి సమానముగా మాస్టర్ స్నేహ సాగరముగా అవుతుంది. అందుకే విశ్వములోని ఆత్మలు స్నేహము యొక్క అనుభవముతో స్వతహాగా సమీపముగా వస్తారు. పవిత్రమైన ప్రేమ మరియు ఈశ్వరీయ పరివారము యొక్క పాలన అయస్కాంతము వలె స్వతహాగా ప్రతి ఒక్కరినీ సమీపముగా తీసుకువస్తుంది. ఈ ఈశ్వరీయ స్నేహము అందరినీ సహయోగులుగా చేసి ముందుకు వెళ్ళే సూత్రములో బంధిస్తుంది.
స్లోగన్:- సంకల్పాలు, మాటలు, సమయము, గుణాలు మరియు శక్తుల ఖజానాలను జమ చేసుకున్నట్లయితే వాటి సహయోగము లభిస్తూ ఉంటుంది.

 

మురళి అంటే ఏమిటి?

మురళి బ్రహ్మకుమారీల దైనిక ఆధ్యాత్మిక బోధన, ఇది ప్రతి ఉదయం మధుబన్ నుండి ప్రచురించబడుతుంది. ఇక్కడ మీరు ఈరోజు మురళిని తెలుగులో చదవవచ్చు, ఆడియో వినవచ్చు మరియు PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధ్యయనానికి సహాయంగా పాఠ్యాన్ని హైలైట్ చేయవచ్చు — మీ గుర్తులు ఈ బ్రౌజర్‌లోనే సురక్షితంగా ఉంటాయి.

28 భాషల్లో మురళి

Daily Murli · Madhuban మూలం: మధుబన్ మురళి విభాగం ఇది స్వతంత్ర రీడర్ యాప్, అధికారిక వెబ్‌సైట్ కాదు.