| 20-11-2026 |
ప్రాత:మురళి
ఓంశాంతి
"బాప్ దాదా"
|
మధువనం |
| ‘‘మధురమైన పిల్లలూ - సేవతో పాటు స్మృతియాత్రను కూడా చేస్తూ ఉండాలి, ఈ ఆత్మిక యాత్రలో ఎప్పుడూ చల్లబడకూడదు’’ | |
| ప్రశ్న:- | పిల్లల మనసు ఒకవేళ ఆత్మిక సేవలో నిమగ్నమవ్వకపోతే, దానికి కారణమేమిటి? |
| జవాబు:- | ఒకవేళ ఆత్మిక సేవలో మనసు నిమగ్నమవ్వకపోతే తప్పకుండా దేహాభిమానము యొక్క గ్రహచారము ఉన్నట్లు. నడుస్తూ-నడుస్తూ దేహాభిమానము కారణముగా ఎప్పుడైతే పరస్పరములో అలుగుతారో, అప్పుడు సేవను వదిలేస్తారు. ఒకరి ముఖాన్ని ఒకరు చూడగానే సేవా ఆలోచనలు పోతాయి. అందుకే బాబా అంటారు, ఈ గ్రహచారము నుండి సంభాళించుకోండి. |
| పాట:- | మా తీర్థము అతీతమైనది... |
ఓంశాంతి. ఈ పాటలోని లైన్ పిల్లలను అప్రమత్తము చేసింది. ఇది ఏం చెప్తుంది? మేము తీర్థయాత్రలో ఉన్నాము మరియు మా ఈ యాత్ర అన్నిటికంటే అతీతమైనది అని బుద్ధిలో గుర్తుంచుకోవాలి. ఈ యాత్రను మర్చిపోకండి. యాత్రపైనే అంతా ఆధారపడి ఉంది. మిగతావారు దైహిక యాత్రలకు వెళ్ళి తిరిగి వస్తారు మరియు జన్మజన్మలుగా యాత్రలను చేస్తూనే ఉంటారు. మన తీర్థ యాత్ర అటువంటిది కాదు. అమరనాథ్ కు వెళ్ళి తిరిగి మృత్యులోకములోకి వచ్చేటటువంటిది కాదు. మీది అటువంటి యాత్ర కాదు, మిగతా మనుష్యులందరివి అటువంటి యాత్రలు. తీర్థ స్థానాలకు వెళ్ళి, చుట్టూ తిరిగి, మళ్ళీ వచ్చి పతితులుగా అయిపోతారు. రకరకాల యాత్రలు ఉన్నాయి కదా. దేవీల మందిరాలు కూడా చాలా ఉన్నాయి. వికారులతో కలిసి ఎన్ని యాత్రలకు వెళ్తారు. పిల్లలైన మీరైతే నిర్వికారులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసారు. ఇది నిర్వికారులైన మీ యాత్ర. నిర్వికారుడైన తండ్రి, ఎవరైతే సదా పవిత్రులో, వారిని స్మృతి చేయాలి. నీటి సాగరాన్ని వికారీ లేక నిర్వికారి అని అనరు, అంతేకాక దాని నుండి వెలువడిన గంగలు కూడా నిర్వికారిగా తయారుచేయవు. మనుష్యమాత్రులు ఎంత పతితముగా అయిపోయారంటే ఏమీ అర్థం చేసుకోరు. ఆ దైహిక యాత్రలు అల్పకాలికమైన క్షణ భంగుర యాత్రలు. ఈ యాత్ర సుదీర్ఘమైనది. పిల్లలైన మీరు లేస్తూ-కూర్చుంటూ యాత్ర గురించి ఆలోచిస్తూ ఉండాలి. యాత్రలకు వెళ్ళినప్పుడు వ్యాపార-వ్యవహారాలు, గృహస్థ వ్యవహారాలు మొదలైనవాటన్నిటినీ మర్చిపోవాల్సి ఉంటుంది. అమర నాథ్ కు జై... అని అంటూ వెళ్తారు. నెల, రెండు నెలలు తీర్థయాత్రలు చేసి వచ్చి మళ్ళీ అశుద్ధమవుతారు. అప్పుడు గంగా స్నానము చేయడానికి వెళ్తారు. వారు రోజూ పతితముగా అవుతున్నారు అన్న విషయము వారికి తెలియనే తెలియదు. గంగా, యమునా తీరాలలో నివసించేవారు కూడా రోజూ పతితముగా అవుతారు. రోజూ గంగలోకి వెళ్ళి స్నానము చేస్తారు. ఒకటేమో నియమముగా చేస్తారు, రెండవది పండుగ రోజులలో వెళ్తారు, గంగను పతిత-పావనిగా భావిస్తారు. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే గంగ పావనముగా చేస్తుందని, ఆ తర్వాత అలా ఉండదని కాదు. ఏ రోజు అయితే మేళా జరుగుతుందో, ఆ రోజు అది పతిత-పావనిగా అవుతుంది అని కాదు. అలా కాదు. ఆ నది అయితే సదా ఉండనే ఉంటుంది. స్నానాలు చేయడానికి రోజూ కూడా వెళ్తారు. మేళాలు జరిగినప్పుడు కూడా విశేషమైన రోజులలో వెళ్తారు. కానీ అందులో అర్థమేమీ లేదు. గంగ, యమున అయితే అవే కదా. వాటిలో శవాలను కూడా వేస్తూ ఉంటారు.
ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మిక యాత్రలో ఉండాలి, అంతే. ఇప్పుడిక మనము ఇంటికి వెళ్తాము. ఇందులో గంగా స్నానము చేసే లేక శాస్త్రాలను చదివే విషయమేమీ లేదు. తండ్రి రావడం కూడా కేవలం ఒక్కసారి మాత్రమే వస్తారు. మొత్తం ప్రపంచము కూడా పతితము నుండి పావనముగా ఒక్కసారి మాత్రమే అవుతుంది. సత్యయుగము కొత్త ప్రపంచమని, కలియుగము పాత ప్రపంచమని కూడా తెలుసు. తండ్రి కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనము చేయడానికి తప్పకుండా రావాలి. ఇది వారి పనే. కానీ మాయ ఎటువంటి తమోప్రధాన బుద్ధి కలవారిగా తయారుచేసిందంటే, ఇక ఏమీ అర్థం చేసుకోరు. ప్రదర్శనీలలో ఎంతమంది పెద్ద-పెద్దవారు వస్తారు, సన్యాసులు కూడా వస్తారు. అయినా కానీ కోట్లలో కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మీరు లక్షలాది, కోట్లాది మందికి అర్థం చేయిస్తే, ఎవరో కొందరు వస్తారు. చాలా మందికి అర్థం చేయించాల్సి ఉంటుంది. చివరికి మీ ఈ వివరణ మరియు చిత్రాలు మొదలైనవన్నీ వార్తాపత్రికలలో కూడా వస్తాయి. మెట్ల వరస చిత్రము కూడా వార్తాపత్రికలలో వస్తుంది. వారు అంటారు - ఇది కేవలం భారత్ కు సంబంధించే ఉంది, మిగిలిన ధర్మాల వారు ఎక్కడ ఉన్నారు? వినాశన సమయము అని కూడా అంటూ ఉంటారు. వినాశన సమయము అంటే తిరిగి వెళ్ళే సమయము. పాత ప్రపంచ వినాశనము, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుందంటే, తప్పకుండా అందరూ తిరిగి వెళ్తారు కదా. అందరి వినాశనము జరగనున్నది. కొత్త ప్రపంచము స్థాపన అవుతూ ఉంది. ఈ విషయాలు పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. నరకవాసుల వినాశనము, స్వర్గవాసుల స్థాపన జరుగుతూ ఉందని మీకు తెలుసు. కల్ప-కల్పము ఇలాగే జరుగుతుంది. ఇప్పుడిక కొద్ది సమయము ఏదైతే మిగిలి ఉందో, ఇందులో కూడా అనేకమందికి వివరణ లభిస్తూ ఉంటుంది. మేళాలు జరుగుతూ ఉంటాయి. మేము మేళా చేయాలా, ప్రదర్శనీ చేయాలా అని అన్ని వైపుల నుండి వ్రాస్తూ ఉంటారు. కానీ వాటితో పాటు తమ స్మృతియాత్రను కూడా మర్చిపోకూడదు. పిల్లలు పూర్తిగా చల్లగా నడుస్తున్నారు. యాత్రను వృద్ధుల వలె చేస్తున్నారు. శక్తియే లేనట్లు, ఏమీ తినలేదు అన్నట్లు చేస్తున్నారు. బాబాకు ఎంత ఆలోచన నడుస్తూ ఉంటుంది. ఆలోచిస్తూ-ఆలోచిస్తూ నిద్ర కూడా దూరమైపోతుంది. విచార సాగర మంథనమైతే అందరూ చేయాలి కదా. మమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. కావున పిల్లలకు ఎంత అపారమైన సంతోషముండాలి. ఈ చదువుతో మేము విశ్వానికి యజమానులుగా అవుతాము. కొందరి నడవడిక పీతల వలె ఉంటుంది. పీతలను తండ్రి దేవతలుగా తయారుచేస్తారు. అయినా కూడా, కష్టం మీద కొందరి నడవడిక చక్కబడుతుంది. ఈ మెట్ల వరస చిత్రములో చాలా మంచి జ్ఞానముంది. కానీ పిల్లలు అంత పని చేయడము లేదు. యాత్రను చేయడమే లేదు. తండ్రిని స్మృతి చేస్తే బుద్ధి తాళము కూడా తెరుచుకుంటూ ఉంటుంది. బంగారు బుద్ధి తయారవుతూ ఉంటుంది. పిల్లలైన మీది పారసబుద్ధి వలె ఉండాలి, అనేకుల కళ్యాణము చేయాలి. మీరు సతోప్రధానము నుండి ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి. శ్రీకృష్ణుడిని శ్యామసుందరుడు అని అంటారు. తండ్రి కూర్చుని నల్లగా ఉన్న ఆత్మకు అర్థం చేయించారు. బాబా నన్ను విశ్వానికి యజమానిగా చేస్తున్నారని ఆత్మకు తెలుసు కావున సంతోషముతో బుద్ధి ఎంత నిండుగా ఉండాలి. ఇందులో అహంకారము యొక్క విషయమేమీ లేదు. తండ్రి ఎంతటి నిరహంకారి. బుద్ధిలో ఎంత సంతోషముంటుంది. రేపు మనం వజ్ర-వైఢూర్యాల మహళ్ళను తయారుచేస్తాము. కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తాము. ఇది పూర్తిగా పతిత ప్రపంచము. ఈ ప్రపంచములోని మనుష్యులైతే దేనికీ పనికిరారు, వారికేమీ తెలియదు. ఒకప్పుడు వజ్ర సమానమైన జీవితముండేదని, వారే మళ్ళీ 84 జన్మలను తీసుకుని గవ్వ సమానముగా అయిపోతారని ఇది కూడా చూపించాలి. ఈ మెట్ల వరస చిత్రము నంబర్ వన్, రెండవ నంబరు త్రిమూర్తి చిత్రము.
సమీప భవిష్యత్తులో శ్రేష్ఠాచారీ భారత్ తయారవుతుంది అని మీరు అంటారు. శ్రేష్ఠాచారీ ప్రపంచములో చాలా కొద్దిమంది మనుష్యులు ఉంటారు, ఇప్పుడు ఎంతమంది మనుష్యులు ఉన్నారు. మహాభారత యుద్ధము కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. అగ్ని వ్యాపిస్తూ ఉంది. సరిదిద్దేందుకు ఎంతగా ప్రయత్నిస్తూ ఉంటారో, అంతగానే దిగజారుతూ ఉంటారు. తండ్రి పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పిల్లలకు ఎంతటి నషాను కలిగిస్తారు. కొందరైతే ఇక్కడి నుండి బయటకు వెళ్ళగానే మొత్తం జ్ఞానమంతా దూరమైపోతుంది. ఏమీ గుర్తుండదు. లేదంటే వెళ్ళి సేవ చేయాలి అనే అభిరుచి ఉండాలి. బాబా కూడా గుణాలను చూసి సేవకు పంపిస్తారు కదా. ఇందులో చాలా హర్షితముగా ఉంటారు. సేవలో సంతోషపు పాదరసము పైకి ఎక్కుతుంది. మంచి-మంచి పాత పిల్లలు పరస్పరములో చిన్న-చిన్న విషయాలకు కూడా అలుగుతారు. ఈ విషయాల కారణముగా మీరు సేవ చేయడం మానకూడదు. సేవనైతే సంతోషముగా చేయాలి. ఎవరితోనైనా పడకపోతే, వారి ముఖాన్ని చూడగానే సేవా ఆలోచన దూరమైపోతుంది. సేవలో మనసు నిమగ్నమవ్వకపోతే పక్కకు వెళ్ళిపోతారు. అప్పుడిక జ్ఞానులకు, అజ్ఞానులకు తేడా ఏమీ లేనట్లు. దేహాభిమానమనే గ్రహచారము వచ్చి కూర్చుంటుంది. ఇది మొదటి నంబరు వ్యాధి. తండ్రి అంటారు - పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి. ఆత్మయే అంతా చేస్తుంది కదా. ఆత్మయే వికారిగా మరియు నిర్వికారిగా అవుతుంది. స్వర్గములో నిర్వికారిగా ఉండేది. రావణ రాజ్యములో ఆత్మయే వికారిగా అయ్యింది. డ్రామా కూడా ఇలా తయారుచేయబడి ఉంది, అందుకే ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు. ఎవరైతే నిర్వికారులుగా ఉండేవారో, వారే పతితులుగా, వికారులుగా అయ్యారు. మనమే నిర్వికారులుగా ఉండేవారమని, ఇప్పుడు వికారులుగా అయ్యామని ఎవరి బుద్ధిలోనూ లేదు. ఆత్మలమైన మనము మూలవతనములో ఉండేవారము. అక్కడైతే ఆత్మలమైన మనము నిర్వికారులుగా ఉంటాము. ఇక్కడ శరీరములోకి వచ్చి పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ వికారులుగా అయ్యాము. ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మ శాంతిధామము నుండి వచ్చినప్పుడు తప్పకుండా పవిత్రముగానే ఉంటుంది, తర్వాత అపవిత్రముగా అయ్యింది. పవిత్ర ప్రపంచములో 9 లక్షల మంది ఉంటారు. మరి ఇంతమంది ఆత్మలు ఎక్కడి నుండి వచ్చారు? తప్పకుండా శాంతిధామము నుండి వచ్చి ఉంటారు. అది శాంతిమయమైన నిరాకారీ లోకము. అక్కడ ఆత్మలన్నీ పవిత్రముగా ఉంటాయి, తర్వాత పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ సతో, రజో, తమోలలోకి వస్తాయి. పావనము నుండి పతితముగా అయ్యేది ఉంటుంది. మళ్ళీ తండ్రి వచ్చి అందరినీ పావనముగా తయారుచేస్తారు. ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. డ్రామా ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ తెలియజేయలేరు. ఆ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. ఋషులు, మునులు కూడా తెలియదు, తెలియదు అని అంటూ వచ్చారు. మాకు భగవంతుడు మరియు వారి రచన గురించి తెలియదు అని అంటూ వచ్చారు. మళ్ళీ గాడ్ ఫాదర్ నాలెడ్జ్ ఫుల్ అని కూడా అంటారు. ఆ పరమాత్మ సర్వాత్మలకు తండ్రి, బీజరూపుడు. వారు ఆత్మలకు బీజరూపుడు మరియు ఈ ప్రజాపిత బ్రహ్మా మనుష్య సృష్టికి బీజరూపుడు. ఆ నిరాకార తండ్రి వీరిలో ప్రవేశించి మనుష్యుని ద్వారా మనుష్యులకు అర్థం చేయిస్తారు. వారిని మనుష్య సృష్టికి బీజరూపుడని అనరు. వారు ఆత్మల తండ్రి మరియు ఈ బ్రహ్మా మనుష్య సృష్టికి ప్రజాపిత, వీరి ద్వారా తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. శరీరము వేరు, ఆత్మ వేరు కదా. మనసు, బుద్ధి మరియు చిత్తము ఆత్మలో ఉన్నాయి. ఆత్మ వచ్చి పాత్రను అభినయించేందుకు శరీరములోకి ప్రవేశిస్తుంది.
ఎవరైనా శరీరము వదిలితే, వెళ్ళి మరో పాత్రను అభినయిస్తారని మీకు తెలుసు, ఇందులో ఏడవడం వలన ఏం జరుగుతుంది. పోయినవారు పోయారు, వారు మళ్ళీ వచ్చి మన మావయ్యగా, చిన్నాన్నగా అవ్వరు. ఏడవడం వలన లాభమేముంది. మీ మమ్మా వెళ్ళిపోయారు, డ్రామానుసారముగా పాత్రను అభినయిస్తున్నారు. ఇలా చాలామంది వెళ్ళిపోతారు. ఎక్కడికో వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఎవరు ఎంతటి ఆజ్ఞాకారీ బిడ్డగా ఉంటే, వారు తప్పకుండా అంతటి మంచి ఇంటిలో జన్మ తీసుకుని ఉండవచ్చు అని అర్థమవుతుంది. ఇక్కడి నుండి వెళ్ళడమే మంచి ఇంటిలోకి వెళ్తారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తే, వారు అలాంటి ఇంటికి వెళ్తారు. చివరిలో మీరు వెళ్ళి రాజ్య కుటుంబములో జన్మ తీసుకుంటారు. ఎవరెవరు రాజుల వద్దకు వెళ్తారు అనేది స్వయమే అర్థం చేసుకోగలరు కదా. అయినా దైవీ సంస్కారాలనైతే తీసుకువెళ్తారు కదా. ఇందులో చాలా విశాల బుద్ధితో విచార సాగర మంథనము చేయాల్సి ఉంటుంది. తండ్రి జ్ఞానసాగరుడు కావున పిల్లలు కూడా జ్ఞానసాగరులుగా అవ్వాలి. నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. మున్ముందు ఉన్నతి జరుగుతూ ఉంటుందని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు పని చేయలేని వారు రేపు చాలామంది కంటే చురుకుగా ముందుకు వెళ్ళిపోవచ్చు. గ్రహచారము తొలగిపోవచ్చు. కొందరిపై రాహు గ్రహచారము కూర్చుంటే మురికిలో పడిపోతారు. ఎముకలే విరిగిపోతాయి. అనంతమైన తండ్రికి ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పడిపోతే ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు లభిస్తాయి. వీరు అనంతమైన తండ్రి, అనంతమైన ధర్మరాజు కనుక అనంతమైన శిక్షలు లభిస్తాయి. ఏదైనా విషయాన్ని పెడచెవిన పెడితే లేక ఏవైనా తప్పుడు పనులు చేస్తే, తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు. మేము భగవంతుని ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నామని అర్థం చేసుకోరు. ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. శ్రీమతముపై నడవండి, సేవలో సహాయకులుగా అవ్వండి. యోగము యొక్క యాత్రలో ఉండండి. చిత్రాలపై అర్థం చేయించే ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోతుంది లేదంటే ఉన్నత పదవి ఎలా లభిస్తుంది. అజ్ఞాన కాలములో కొంతమందికి చాలా సుపుత్రులైన పిల్లలు ఉంటారు, కొందరు చాలా కుపుత్రులుగా కూడా ఉంటారు. ఇక్కడ కూడా కొంతమంది వెంటనే బాబా కార్యాన్ని చేసి చూపిస్తారు. కావున పిల్లలు అనంతమైన సేవ చేయాలి. అనంతమైన ఆత్మలకు కళ్యాణము చేయాలి. మన్మనాభవ యొక్క సందేశాన్ని ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేయడముతో మీ బుద్ధి తమోప్రధానము నుండి సతోప్రధానము అయిపోతుంది. ఇప్పుడిది ఈ కలియుగీ తమోప్రధానమైన ప్రపంచము యొక్క అంతిమము. ఇప్పుడు సతోప్రధానముగా అవ్వాలి. అక్కడ ఆత్మలు కూడా నంబరువారుగా ఉండే ప్రపంచము ఉంది కదా. వారు మళ్ళీ నంబరువారుగా వచ్చి పాత్రను అభినయిస్తారు. రావడం కూడా నంబరువారుగా, డ్రామానుసారముగా వస్తారు. ఇప్పుడు ఆత్మలందరూ రావణ రాజ్యములో దుఃఖితులుగా ఉన్నారు, అయినా ఏమీ అర్థం చేసుకోరు. మీరు పతితులు అని ఎవరితోనైనా అంటే డిస్టర్బ్ అవుతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది ఉన్నదే వికారీ ప్రపంచము. తండ్రి అంటారు - మీరు మీ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. మిగిలినవారంతా వినాశనమై తిరిగి వెళ్ళిపోతారు. మహాభారత యుద్ధము జరగనున్నది అని అంటూ ఉంటారు, తద్వారా అన్ని ధర్మాలు సమాప్తమై ఒకే ధర్మము ఉంటుంది. ఈ యుద్ధము తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఎంత మంచి రీతిలో పిల్లలకు అర్థం చేయిస్తారు. మున్ముందు మీరు చెప్పే విషయాలను వింటూ ఉంటారు మరియు వస్తూ ఉంటారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, ఎవరైతే పతితముగా అయిపోయారో, వారే వచ్చి నంబరువారుగా తమ వారసత్వాన్ని తీసుకుంటారు. ప్రజలైతే అనేకమంది తయారవుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. భగవంతుని ఆజ్ఞలను ఎప్పుడూ ఉల్లంఘించకూడదు. అనంతమైన సేవలో సుపుత్రులైన పిల్లలుగా అయి సహాయకులుగా అవ్వాలి.
2. జ్ఞాన ధనము యొక్క గుప్తమైన సంతోషముతో బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. పరస్పరములో ఎప్పుడూ అలగకూడదు.
| వరదానము:- |
ప్రతి అడుగు ఆజ్ఞపై నడుస్తూ మాయను బలిహారం చేయించే సహజయోగీ భవ ఏ పిల్లలైతే ప్రతి అడుగు ఆజ్ఞపై నడుస్తారో, వారి ఎదురుగా మొత్తం విశ్వము బలిహారమవుతుంది, దానితో పాటు మాయ కూడా తన వంశ సహితముగా బలిహారమైపోతుంది. మొదట మీరు తండ్రిపై బలిహారమైనట్లయితే మాయ మీపై బలిహారమవుతుంది మరియు మీరు మీ శ్రేష్ఠ స్వమానములో ఉంటూ ప్రతి ఆజ్ఞపై నడుస్తూ ఉన్నట్లయితే జన్మజన్మల కష్టము నుండి విడుదలవుతారు. ఇప్పుడు సహజయోగులుగా ఉంటారు మరియు భవిష్యత్తులో సహజమైన జీవితముంటుంది. ఇటువంటి సహజమైన జీవితాన్ని తయారుచేసుకోండి. |
| స్లోగన్:- | స్వయం యొక్క పరివర్తన ద్వారా ఇతర ఆత్మలను పరివర్తన చేయడమే ప్రాణదానము ఇవ్వడము. |
అవ్యక్త ప్రేరణలు - బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి
సంకల్పము చేయగానే ఏ స్థితిలో స్థితులవ్వాలనుకున్నారో ఆ స్థితిలో స్థితులైపోవాలి - ఇదే బాబా సమానమైన సంపూర్ణ అవస్థ మరియు కర్మాతీత అంతిమ స్టేజ్. ఎంతగా సంపూర్ణ అవస్థకు సమీపముగా ఉంటారో అనగా బాబాకు సమీపముగా ఉంటారో, దాని అనుసారముగానే భవిష్య ప్రారబ్ధములో కూడా రాజ్య అధికారులుగా ఉంటారు. ఎంతగా నషా ఉంటుందో అంతగా మీ కర్మాతీత అవస్థకు గుర్తులు సమీపముగా కనిపిస్తాయి.